చంద్రబాబు పెద్ద తోపు ఏం కాదు.. పవర్ బ్రోకర్ ఇమేజ్ తనది : ఓపెన్ సీక్రెట్ చెప్పిన విజయసాయిరెడ్డి
వైయస్సార్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిత్యం విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయ సాయి రెడ్డి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది అంటూ నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు అంటూ సెటైర్లు వేశారు.

కనుచూపుమేర బాబుకు సానుకూలత లేదు
తీవ్ర నిరాశ నిస్పృహ అలముకున్నప్పుడు చాలామంది విచక్షణ కోల్పోతారని పేర్కొన్న విజయసాయిరెడ్డి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పరిస్థితి అదే విధంగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ప్రజల తిరస్కారంతో పొరుగు రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్నారని, చంద్రబాబు నాయుడుకి ప్రతి ఎన్నిక చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కనుచూపుమేర చంద్రబాబునాయుడుకు సానుకూలత కనిపించని పరిస్థితి ఉందని తేల్చి చెప్పారు.

చంద్రబాబుకు వాళ్ళు డబ్బుల సంచులు అందించటం ఓపెన్ సీక్రెట్
అంతేకాదు చంద్రబాబు ఆయన బానిస మీడియా శోకాలు పెట్టడం తప్ప చేయగలిగిందేమీ లేదు అంటూ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును విమర్శించారు. ఇదే సమయంలో ఎన్డీఏ కన్వీనర్ గా చక్రం తిప్పిన రోజుల్లో కూడా బాబు పెద్ద తోపు ఏం కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. చంద్రబాబుది పవర్ బ్రోకర్ ఇమేజ్ అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. విద్యుత్ కంపెనీలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు ప్రైవేట్ ఫ్లైట్ లలో దిగి డబ్బుల సంచులు అందించటం ఓపెన్ సీక్రెట్ అంటూ విమర్శించారు.

పత్తిగింజల్లా టీడీపీ నేతల మాటలు
ఇప్పుడు చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు పత్తి గింజల్లా మాట్లాడుతున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయసాయిరెడ్డి.ఇక జగన్ ఢిల్లీ పర్యటన పై టిడిపి నాయకులు చేసిన విమర్శలకు సైతం కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి జగన్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసిందని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పలు కార్యక్రమాలు, పలు పథకాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని కితాబిచ్చారు. అంతకు ముందు పోలవరం పూర్తి కావడం, బాబు రాజకీయ సమాధి ఒకేసారి జరుగుతాయని చంద్రబాబుని టార్గెట్ చేసి నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి.












Click it and Unblock the Notifications