ఢిల్లీ బిల్లును రాజ్యసభలో సమర్ధించిన వైసీపీ-ఇండియా కూటమి, ఆప్ తో సాయిరెడ్డి చెడుగుడు..
ఢిల్లీలో అధికారాల్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు లోక్ సభలో ఢిల్లీ బిల్లు పెట్టి నెగ్గించుకున్న కేంద్రం.. ఇవాళ రాజ్యసభలోనూ ఈ బిల్లు పెట్టింది. దీనికి ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎంపీలు మద్దతిచ్చారు. రాజ్యసభలో ఈ మేరకు వైసీపీ స్టాండ్ తెలియజేసిన ఎంపీ విజయసాయిరెడ్డి.. అనంతరం బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాలపై నిప్పులు చెరిగారు.
వైసీపీ, సీఎం జగన్ తరఫున ఢిల్లీ బిల్లుకు మద్దతిస్తున్నానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆర్టికల్ 239ఏఏ లో మూడు సబ్ క్లాజులు ఉన్నాయని, సబ్ క్లాజ్ ఏలో ఢిల్లీ అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారముందన్నారు. పబ్లిక్ ఆర్డర్, పోలీసు, న్యాయసంబంధమైన అంశాలు మినహా మిగతా చట్టాలు చేయొచ్చు కానీ పార్లమెంటుకు ఏ అంశంలో అయినా చట్టం చేసే అధికారం ఉందన్నారు. పార్లమెంటు చేసే చట్టంతో ఢిల్లీ ప్రభుత్వం చేసే చట్టాలు చెల్లుబాటు కావన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ అభిప్రాయాలు చట్టప్రకారం చెల్లవన్నారు.

ఢిల్లీలో అధికారులపై పెత్తనం చేసే అధికారం కేంద్రానికి లేదని సుప్రీంకోర్టు చెప్పలేదని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు.
కేంద్రం పార్లమెంటు ద్వారా చేసే చట్టాలకు లోబడే ఢిల్లీ ప్రభుత్వం చట్టాలు, నిర్ణయాలు చేయగలదని, అందుకే వైసీపీ ఈ చట్టానికి మద్దతిస్తోందన్నారు. ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి దీన్ని ఇతర రాష్ట్రాలతో కలిపి కాకుండా ప్రత్యేకంగా చూడాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఇండియా కూటమి స్వార్ధ రాజకీయాల కోసమే ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు.
ఆప్ ఢిల్లీలో ఆజ్యం పోస్తుండటం వల్లే మొత్తం దేశానికి ఈ పరిస్ధితి వచ్చిందని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆప్ నియంతృత్వ పార్టీ అని, ఆప్ తానా షాహీ పార్టీ అని సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. కేజ్రివాల్ గతంలో వేర్పాటువాదుల నుంచి పార్టీ కోసం నిధులు తీసుకుంటున్నారని ఆ పార్టీ మాజీ నేత కుమార్ బిశ్వాస్ చేసిన ఆరోపణల్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. దీంతో సాయిరెడ్డి వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో జోక్యం చేసుకున్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్.. మీ వ్యాఖ్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
దేశద్రోహులకు అధికారం అందించాలని కోరుకుంటున్నారా అంటూ విపక్షాలపై సాయిరెడ్డి ఎదురుదాడికి దిగారు.












Click it and Unblock the Notifications