కాల్ మనీ షాకింగ్, ఎమ్మెల్యేల పాత్ర?: 3 బస్తాల డాక్యుమెంట్లు లభ్యం
విజయవాడ: కాల్ మనీ దందా మోసాలు అందరినీ షాకింగ్‌కు గురి చేస్తున్నాయి. కాల్ మనీ దందాలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
విదేశాల్లో విద్య పేరుతో సత్యానందం అనే వ్యక్తి మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ట్రస్ట్ పేరుతో పలువురు యువతులను కూడా మోసం చేశాడని తెలుస్తోంది. కాల్ మనీ ముఠా బాధితుల్లో ఓ ప్రజాప్రతినిధి కూడా ఉన్నారని తెలుస్తోంది.
కాల్ మనీ దందా వెలుగు చూడటంతో టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వహిస్తోంది. 3 బస్తాల ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు లభ్యమైనట్లుగా సమాచారం. విచారణలో భాగంగా నిందితుల నుంచి మూడు బస్తాల డాక్యుమెంట్లను స్వాధీనపరచుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు.

ఓ ప్రజాప్రతినిధి ఎన్నికల సమయంలో కాల్ మనీ వద్ద రూ.2 కోట్ల మేర అప్పు చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. కాల్ మనీ దందా కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు.
మరోవైపు, అధిక వడ్డీలకు అప్పులిచ్చి, వాటిని తీర్చలేకపోయిన మహిళలను వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దించాలని చూసిన కాల్ మనీ దందా చేసే వారి తీరు బయటపడిన తర్వాత కూడా వారి అనుచరుల ఆగడాలు ఆగలేదు.
తాజాగా, అప్పు తీర్చకుంటే మహిళలపై అత్యాచారం చేస్తామంటూ గత రాత్రి పలువురి ఇళ్లకు బౌన్సర్లు వెళ్లి బెదిరించినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు బౌన్సర్ల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు.
ఈ కేసులో చెన్నుపాటి శ్రీను, ట్రాన్స్ కో డీఈ సత్యానందం కోసం పోలీసులు గాలిస్తున్నారు. సత్యానందం ఒడిశా పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతని కోసం ఓ బృందాన్ని పంపించే అవకాశముంది.












Click it and Unblock the Notifications