నర్సాపూర్ కు వందే భారత్- ముహుర్తం ఫిక్స్..!
చెన్నై నుంచి విజయవాడ వరకూ రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇకపై పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ కు పరుగులు తీయబోతోంది. ఈ మేరకు ఈ రైలు పొడిగింపు కోసం స్థానిక ఎంపీ, కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి కూడా అయిన శ్రీనివాసవర్మ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో కేంద్రమంత్రి వందే భారత్ రైలు పొడిగింపుతో పాటు మరికొన్ని అంశాల్నీ వెల్లడించారు.
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ జాతీయ రహదారుల నిర్మాణం, కొత్త రైల్వే ప్రాజెక్టుల సాధనపై దృష్టి సారించినట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. చెన్నై-విజయవాడ వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగించాలని రైల్వే మంత్రిని, రైల్వే ఉన్నతాధికారులను కలిసి పలుమార్లు చర్చించినట్లు తెలిపారు.కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం అన్ని సమస్యలను పరిష్కరించామని, ఈ నెలలోనే నరసాపురం నుంచి చెన్నై వరకు వందే భారత్ రైలు పొడిగింపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు.

మరోవైపు అత్తిలి రైల్వే స్టేషన్‌లో కరోనా మహమ్మారి తర్వాత ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఇచ్చిన హామీ మేరకు తాను రైల్వే ఉన్నతాధికారులతో చర్చించానని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. తన విజ్ఞప్తికి స్పందించిన రైల్వే శాఖ అధికారులు పూరీ-తిరుపతి మరియు కాకినాడ-చెన్నై సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లు అత్తిలిలో హాల్ట్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు. రెండు రోజుల్లో దీనిపై ఉత్తర్వులు విడుదల అవుతాయన్నారు.

నరసాపురం-అరుణాచలం వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును మరో నెల పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారని, ఈ రైలును రెగ్యులర్ రైలుగా మార్చాలని తాను చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన వచ్చిందన్నారు. అరుణాచలం రైలుకు రెగ్యులర్ రైలుగా అనుమతి లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లను 'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్రమంత్రి వర్మ తెలిపారు.












Click it and Unblock the Notifications