Ys Jagan Stone Attack : జగన్ పై రాయి విసిరిన సతీష్ కు బెయిల్..!
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ కుమార్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. జగన్ పై రాయి దాడి కేసులో సతీష్ ను ఏకైక నిందితుడిగా పోలీసులు గతంలో అరెస్టు చేసారు. అయితే సతీష్ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా కోర్టుల్లో విచారణ ఆలస్యమైంది. చివరికి సతీష్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ స్థానిక కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.
ఏప్రిల్ 13న విజయవాడలో వైసీపీ మేమంతా సిద్దం ప్రచారంలో ఉన్న సీఎం జగన్ పై నిందితుడు వేముల సతీష్ గులకరాయి విసిరాడు. అయితే చీకటిగా ఉండటంతో వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేకపోయారు. అనంతరం దర్యాప్తులో భాగంగా సతీష్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అప్పటి నుంచి సతీష్ రిమాండ్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ కోసం సతీష్ దరఖాస్తు చేసుకున్నా పోలీసులు మాత్రం కస్టడీకి ఇవ్వాలని కోరారు.

దీంతో సతీష్ కస్టడీతో పాటు బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగుతూ వచ్చింది. చివరికి నిందితుడికి గత నేర చరిత్ర లేకపోవడం, ఆకతాయి చర్యగానే సీఎం జగన్ పై రాయి విసిరినట్లు ఆయన లాయర్ చేసిన వాదనతో ఏకీభవించిన విజయవాడ 8వ జిల్లా అదనపు కోర్టు ఇవాళ సతీష్ కు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సతీష్ ప్రతీ శనివారం, ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్ కు హాజరై సంతకం చేయాలని కోర్టు షరతు విధించింది.












Click it and Unblock the Notifications