బెజవాడలో ఎదురుతన్నిన "దిశ"- సాయం కోసం వెళ్లి క్వారంటైన్ పాలు...
ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా తీసుకొచ్చిన దిశ పోలీసు వ్యవస్ధలో పనిచేస్తున్న ఇద్దరు అనుకోని రీతిలో సాయం కోసం వెళ్లి బాధితులుగా మిగిలిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. కరోనా బాధితురాలికి సాయం చేసేందుకు వెళ్లిన ఆ ఇద్దరిని హోం క్వారంటైన్లో ఉంచాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.

కరోనా బాధితురాలికి దిశ సాయం-
విజయవాడలో ఈ నెల 19వ తేదీన స్ధానికంగా ఓ మహిళ అస్వస్దతకు గురైంది. స్వీయ చికిత్సతో నయం కాకపోవడంతో ఆమె గ్లోబల్ ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన డాక్టర్లు కరోనా అనుమానంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆస్పత్రికి చెందిన వాహనాలు అందుబాటులో లేకపోవడంతో స్ధానిక పోలీసు వాహనంలో ఇద్దరు పోలీసులు ఆమెను పాత ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఓపీ సేవలు అందుబాటులో లేవని చెప్పడంతో కొత్త ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అక్కడ కోవిడ్ 19 కేసులకు మాత్రమే చికిత్స అందిస్తుండటంతో ఈఎస్ఈ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లి సరికి ఆమె చనిపోయింది.

అనూహ్య మలుపులు..
అంటే ప్రైవేటు ఆస్పత్రి నుంచి పాత ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి కొత్త ప్రభుత్వాసుపత్రికి, తిరిగి అక్కడి నుంచి ఈఎస్ఐ ఆస్పత్రికి బాధితురాలిని తీసుకెళ్లే ప్రయత్నంలో చనిపోయింది. అప్పటికి ఆమెకు కేవలం అస్వస్దతగానే భావించారు. కానీ ఎందుకైనా మంచిదని శాంపిల్స్ పరీక్షిస్తే కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెకు సాయం చేసిన దిశ పోలీసు స్టేషన్ ఎస్సై, సైబర్ నిపుణుడు ఇప్పుడు తలపట్టుకుంటున్నారు.

అత్యవసర సాయం- అనుకోని గాయం...
వాస్తవానికి ప్రైవేటు ఆస్పత్రి అంబులెన్స్ లో ఆమెను ప్రభుత్వాసుపత్రికి పంపాల్సి ఉంది. కానీ ఆమె పరిస్ధితి విషమిస్తుందన్న ఆంచనాతో అత్యవసర సాయం కింద దిశ పోలీసులు సాయం కోసం సిద్ధమయ్యారు. మూడు ఆస్పత్రులకు తిప్పాక ఆమె చనిపోయింది. చివరకు కరోనాగా తేలింది. దీంతో విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు నివ్వెరపోయారు. దిశ పోలీసులే కాబట్టి మహిళగా ఆమెకు సాయం చేసేందుకు వెళ్లి ఇబ్బందులు కొనితెచ్చుకున్నారని ఇప్పుడు బాధపడుతున్నారు. చివరికి వీరిద్దరినీ హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు అందడంతో కుటుంబ సభ్యులు సైతం ఆందోళనలో ఉన్నారు. వీరితో పాటు సాయం చేసిన సిబ్బందికి సైతం క్వారంటైన్ కు పంపాల్సిన పరిస్ధితి ప్రస్తుతం నెలకొంది.












Click it and Unblock the Notifications