వైయస్‌తో జగన్‌ను పోల్చిన జలీల్ ఖాన్: విమర్శలన్నీ మంత్రి పదవి కోసమేనా?
విజయవాడ: ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ చేరిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైయస్ జగన్‌పై తన విమర్శలను మాత్రం తగ్గించడం లేదు. గురువారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ వైఖరిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ వైఖరిని భరించలేకే తాను పార్టీ మారానని ఆయన చెప్పారు. సొంత బంధువులు కూడా జగన్‌ను భరించలేకపోతున్నారని, ఈ కారణంగానే గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చిన వారు కూడా పార్టీ మారుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌ను ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో పోల్చుతూ జలీల్ ఖాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

''వైఎస్ ఎంత అవినీతి చేసినా, పార్టీ నేతలను నవ్వుతూ పలకరించేవారు. జగన్‌లో అవినీతికి తోడు నిరంకుశత్వమూ ఉంది. ఎవరినీ అడగడం గాని, ఎవరైనా చెప్పేది వినే అలవాటు గాని ఆయనకు లేదు. అసెంబ్లీలో ఆయన చేయి ఊపితే... పోడియం వద్దకు పోవడం మినహా మాకు వేరే పని ఉండేది కాదు. జగన్‌ను కలవాలంటే... మేడపై నుంచి ఆయన కిందకు కూడా రారు. మూడు రోజుల ముందుగా ఆయన పీఏను అడగాలి. ఆయన పడుకున్నప్పుడు లేచే దాకా వెయిట్ చేయాలి. ఈ క్రమంలో మనల్ని ఎవరైనా హత్య చేసినా పట్టించుకునే దిక్కుండదు'' అని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు.
మరోవైపు వైసీపీ నుంచి త్వరలో మరో 14 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారని జలీల్ ఖాన్ జోస్యం చెప్పారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ పార్టీ మారిన తర్వాత ఒక్కసారిగా విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య గురువారం నాటికి 16కు చేరింది.
మంత్రి పదవి కోసమే జలీల్ ఖాన్ ఇలా జగన్‌పై విమర్శలు చేస్తున్నారని వైసీపీ మండిపడుతున్నారు. గడచిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒక్క మైనార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అంతేకాదు ఒక్క గిరిజన ఎమ్మెల్యే కూడా టీడీపీ నుంచి గెలవలేదు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి వర్గంలో మైనార్టీలతో పాటు గిరిజనులకు కూడా సరైన ప్రాధాన్యత లభించలేదని వాదన ఉంది.
ఈ క్రమంలో మైనార్టీ వర్గానికి చెందిన జలీల్ ఖాన్‌ను టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా పార్టీలో చేర్చుకుందని వైసీపీ నేతలు అంటున్నారు. అంతేకాదు చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీ వర్గం నుంచి ఉన్న జలీల్ ఖాన్‌కు మంత్రి పదవి ఖాయమనే ఊహాగానాలు ఉన్నాయి. మంత్రి పదవిపై ఆశతోనే జలీల్ ఖాన్... జగన్‌పై విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications