కేశినేని నాని సంచలన ప్రకటన
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన మరోమారు సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. గత కొంతకాలంగా కేశినేని నాని టీడీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. జగన్ వేవ్‌ను తట్టుకుని మరి విజయం సాధించిన తనకు పార్టీలో సముచితం గౌరవం ఇవ్వడం లేదని ఆయన వాపోతున్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కేశినేని నాని.. ఒకనొక సమయం బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది.
వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి టికెట్ దక్కదనే అభిప్రాయం పార్టీ నేతల్లో నెలకొంది. ఆయన తమ్ముడు కేశినేని చిన్ని వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తుంది. సీటుపై ఇప్పటికే కేశినేని చిన్నికి చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. లోకేష్ సైతం చిన్ని వైపే మొగ్గు చూపటంతో బెజవాడ రాజకీయాల్లో కేశినేని నాని ఒంటరైయ్యారు.

ఇటువంటి సమయంలో కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని.. తన కుటుంబం నుంచి కూడా ఎవరూ పోటీలో ఉండరని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే స్వాగతిస్తానని..అంతేకాని బీసీ ముద్ర వేసుకుని అవినీతి చేసే వారికి టికెట్లు ఇవ్వొద్దని నాని పార్టీకి సూచించారు.
ఇదే సమయంలో ఆయన సొంత పార్టీపై విమర్శలు చేశారు. తాను లేకపోతే విజయవాడను దోచుకోవాలని చూస్తున్నారని కేశినేని నాని వ్యాఖ్యనించారు. అందుకే తనని పార్టీలోని కొందరు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. బెజవాడలో అవినీతికి పాల్పడితే సహించేది లేదని.. రాజకీయాల్లోకి నీతిపరులు రావాలని కేశినేని నాని పిలుపునిచ్చారు. కేశినేని నాని చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications