విజయవాడలో ఈసారి నిమజ్జనాలు అక్కడే !-వీఎంసీ కమిషనర్ సూచన..!
ఏపీలోని విజయవాడలో ఈసారి వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. బుడమేరు వరద నీటిలో చాలా ప్రాంతాలు మునిగి ఉన్నాయి. వరద సహాయక చర్యలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. దీంతో వినాయక చవితిపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈసారి వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించే విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలనే అంశంపై నగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఓ ప్రకటన చేశారు.
ఈసారి వినాయకుని నిమజ్జనం సీతమ్మ వారి పాదాలు వద్ద గల కృష్ణానదిలో చేయాలని నగర పాల సంస్థ వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర భక్తుల్ని కోరారు. వినాయక చవితి సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి విగ్రహాల నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను ఆయన వివరించారు. వినాయక చవితి పూర్తయ్యాక ప్రజలు నిమజ్జనం చేసేటప్పుడు విజయవాడ నగర పాలక సంస్థ నిర్దేశించిన ప్రాంతమైన సీతమ్మ వారి పాదాలు కృష్ణా నదిలో మాత్రమే నిమజ్జనం చేయాలని, నగర పరిధిలో ఉన్న బందర్ కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కాలువల్లో నిమజ్జనం చేయవద్దని ప్రజలను కోరారు.

ప్రతి ఏటా దాదాపు వెయ్యి వినాయకుని విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని, వాటి నిమజ్జనానికి రెండు క్రేన్లు, ఒక జేసీబీ, ఒక ప్రోక్లైనర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. వాటి నిర్వహణకై నలుగురు, మూడు షిఫ్టలలో పని చేస్తారని, అందుకు అవసరమైన పారిశుధ్య నిర్వహణ, లైటింగ్ అని ఏర్పాట్లతో విజయవాడ నగరపాలక సంస్థ సిద్ధంగా ఉందన్నారు. ప్రజలందరూ దీనికి సహకరించి, కేవలం విజయవాడ నగరపాలక సంస్థ నిర్దేశించిన సీతమ్మ వారి పాదాల వద్దే విగ్రహాలు నిమజ్జనం చేయవలసిందిగా ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications