NH16లోకి విజయవాడ పశ్చిమ బైపాస్..! రాష్ట్రానికి ఆ హైవే- టోల్ ప్లాజాల మార్పు.. !
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఓవైపు శరవేగంగా సాగుతుండగా.. ఇందులో భాగమై విజయవాడ నగగరంలోనూ కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో భాగంగా నగరంపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వీలుగా నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ కారణంగా ఈ మార్పులు జరగనున్నాయి. ఈ బైపాస్ పూర్తయ్యే సరికి ఓ టోల్ ప్లాజా రద్దయి మరో రెండు టోల్ ప్లాజాలు రాబోతున్నాయి. అలాగే ఈ బైపాస్ జాతీయ రహదారిలో కలిసిపోనుంది.
గుంటూరు జిల్లా కాజా నుంచి కృష్ణాజిల్లా చిన అవుటపల్లి వరకూ 47 కిలోమీటర్ల పొడవున విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం పూర్తి కావస్తోంది. ఇది పూర్తయితే చెన్నై నుంచి కోల్ కతా వెళ్లే వాహనాలు విజయవాడతో సంబంధం లేకుండా బైపాస్ మీదుగా వెళ్లిపోతాయి. అలాగే గుంటూరు నుంచి ఏలూరు వైపు వెళ్లే వాహనాలు సైతం విజయవాడను టచ్ చేయకుండానే బైపాస్ మీదుగా వెళ్లేందుకు వీలు కలుగుతుంది. దీంతో ఈ 47 కిలోమీటర్ల పశ్చిమ బైపాస్ ను చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి 16లో విలీనం చేయబోతున్నారు.

ఇప్పటివరకూ ఇదే కాజా నుంచి చిన అవుటపల్లికి వెళ్లాలంటే విజయవాడలోని స్క్యూ బ్రిడ్జి, బెంజ్ సర్కిల్ , రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి, గన్నవరం మీదుగా వెళ్లాల్సి వచ్చేది. అలాగే ఈ రోడ్డు జాతీయ రహదారి 16లో భాగంగా ఎన్ హెచ్ ఏ ఐ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు పశ్చిమ బైపాస్ రాక, దాన్ని ఎన్ హెచ్ 16లో విలీనం చేస్తున్న నేపథ్యంలో బెంజి సర్కిల్ -గన్నవరం రహదారిని రాష్ట్రానికి ఎన్ హెచ్ ఏఐ బదిలీ చేయనుంది. ఆలోపు దీనికి మరమ్మత్తులు చేసి బదిలీ చేస్తారు.
మరోవైపు విజయవాడ పశ్చిమ బైపాస్ రాకతో నగరం నుంచి ఏలూరువైపుకు వెళ్లే రహదారిపై ఉన్న పొట్టిపాడు టోల్ ప్లాజా రద్దు కాబోతోంది. దాని స్ధానంలో విజయవాడ పశ్చిమ బైపాస్ పైనే వెంకటపాలెం, వెదురుపావులూరు వద్ద రెండు టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. అలాగే కాజా టోల్ ప్లాజా కూడా ఈ బైపాస్ లో భాగం కానుంది. ఇప్పటికే పాక్షికంగా ఓపెన్ చేసిన పశ్చిమ బైపాస్ పై కాజా, వెంకటపాలెం టోల్ ప్లాజాల వద్ద ఫీజు చెల్లించాల్సి వస్తోంది. బైపాస్ ను అధికారికంగా ప్రారంభించాక కాజా టోల్ ప్లాజా కూడా తీసేసి వెంకటపాలెం, వెదురుపావులూరు టోల్ ప్లాజాలు కొనసాగించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications