తొలిరాత్రి-ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి-ఊహించని నిజం తెలిసి షాక్ తిన్న వధువు
ఫారిన్ సంబంధం అనగానే ఆ తల్లిదండ్రులు సంబరపడిపోయారు. బిడ్డ జీవితం బాగుంటుందని భావించారు. ఉన్నంతలో భారీగానే కట్న,కానుకలు సమర్పించి పెళ్లి చేశారు. కానీ పెళ్లి జరిగిన కొద్ది గంటలకే అసలు ట్విస్ట్ బయటపడింది. శోభనం గదిలో అడుగుపెట్టిన ఆ నవ వధువుకు తన భర్త ఒక 'గే' అని తెలిసింది. ఆ విషయాన్ని అతనే స్వయంగా ఆమెతో చెప్పాడు. దీంతో షాక్ తిన్న ఆ యువతి మరుసటి రోజు తల్లిదండ్రులతో విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించింది. అతను గే అన్న విషయం దాచి తనను మోసం చేసినందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

అసలేం జరిగింది..
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పినపాడుకు చెందిన ఓ యువతికి(20) విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ఓ యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్ 4న పెళ్లి జరిగింది. ఉద్యోగ రీత్యా అతను గతంలో కొన్నేళ్లు కెనడాలో ఉన్నాడు. పెళ్లి తర్వాత విదేశాల్లోనే స్థిరపడుతాడని అతని తల్లిదండ్రులు యువతి తల్లిదండ్రులతో చెప్పారు. ఫారిన్ సంబంధం అని మురిసిపోయిన యువతి తల్లిదండ్రులు... రూ.10 లక్షల కట్నంతో పాటు లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు.

శోభనం రాత్రి నిజం బయటపడింది...
పెళ్లి జరిగిన రాత్రి విజయవాడలోని వరుడి ఇంట్లో కొత్త జంటకు శోభనం ఏర్పాట్లు చేశారు. అందరి లాగే ఆ యువతి కూడా సిగ్గుపడుతూ శోభనం గదిలోకి వెళ్లింది. భర్తతో తొలిరాత్రికి ఎన్నో ఆశలతో శోభనం గదిలో అడుగుపెట్టిన ఆమెకు.. కాసేపటికే ఊహించని నిజం తెలిసింది. తాను గే అని... తనకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదని భర్త చెప్పడంతో ఆమె షాక్ తిన్నది. ఏదో పెద్దల బలవంతానికే పెళ్లి చేసుకున్నాను తప్ప... నీపై నాకెలాంటి ఆసక్తి లేదని అతను చెప్పడంతో ఆమె నోట మాట రాలేదు. పైగా ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దని ఆమెను బతిమాలాడు.

వధువు కుటుంబంపై దాడి..?
మరుసటి రోజు విజయవాడలోనే రిసెప్షన్ ఉండటంతో తల్లిదండ్రులు,బంధువులు వచ్చారు. దీంతో తల్లిదండ్రులతో ఆ వధువు అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు రిసెప్షన్ రద్దు చేసుకుని... తమ కూతురిని తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత వరుడి కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేసి వధువు కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వధువు కుటుంబం వెనక్కి తగ్గకపోవడంతో వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో వధువు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వరుడి కుటుంబ సభ్యులు అతను గే అన్న విషయం దాచిపెట్టి తమ కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కట్నంగా ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.