'ఆడుదాం ఆంధ్ర' కు దూరం: జగన్ సర్కార్ పై విలేజ్ వాలంటీర్ల యుద్ధం!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు నేటి నుంచి సమ్మె బాట పట్టనున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు ఆందోళన బాట పడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్ సర్కార్ పై జగన్ సొంత సైన్యం యుద్ధం ప్రకటించటం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అవుతుంది.
ఏపీ వాలంటీర్లు ఇప్పటివరకు తమకు ఇచ్చే గౌరవ వేతనం పెంపు లేకపోవడంతో, తమ సర్వీసులను క్రమబద్దీకరించడం కూడా చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమకు కనీసం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలంత కూడా జీతాలు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వాళ్ళలో గూడు కట్టుకున్న అసంతృప్తి ప్రస్తుతం ఆందోళన రూపం దాల్చింది.

ఈ క్రమంలోనే వారు సమ్మె చేయడానికి రెడీ అయ్యారు. అయితే వాలంటీర్లతో సమ్మె ఆలోచన విరమింప చేయడం కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు సోమవారం సాయంత్రం వరకు తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో నేటి నుంచి సమ్మె సైరన్ మోగించడానికి విలేజ్ వాలంటీర్లు నిర్ణయం తీసుకున్నారు.
2019 అక్టోబర్ నెలలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. ఒక్కో వాలంటీర్ కు ఐదువేల రూపాయల గౌరవ వేతనంగా నిర్ణయించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటికి వేతనాల పెంపు విషయంలో జగన్ సర్కార్ ఎటువంటి చొరవ తీసుకోకపోవడంతో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించారు విలేజ్ వాలంటీర్లు.
సమ్మె చేసేందుకు ఇదే సరైన సమయమని, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించిన విలేజ్ వాలంటీర్లు వారిని ఎంత బుజ్జగించే ప్రయత్నం చేసినా, వారు ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. దీంతో నేటి నుంచి పలు జిల్లాలలో విలేజ్ వాలంటీర్లు సమ్మె సైరన్ మోగిస్తున్నారు. మరి ఇప్పటికైనా జగన్ సర్కార్ వీరి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా .. లేదా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications