MGBS: హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేవారికి APSRTC తీపి కబురు
వినాయక చవితి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ తీపి కబురు అందించింది. రద్దీని తట్టుకోవడానికి హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు విరివిగా ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. సాధారణంగా దసరా, దీపావళి లేదా వినాయక చవితి వంటి పండుగల సమయాల్లో ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలను భారీగా పెంచేస్తుంటారు. అందుకు భిన్నంగా ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎలాంటి అదనపు వసూళ్లు లేకుండా, ప్రయాణికులకు భారం కాని రీతిలో సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది.
పండుగ వేళ సొంత గూటికి చేరాలని ఆరాటపడే సగటు మధ్యతరగతి కుటుంబాల వారికి ఇది ఊరట కలిగించే విషయం. భాగ్యనగరం నుంచి లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని దాదాపు అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలకు ఈ ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని కల్పించారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, భీమవరం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా ప్రయాణించే వారికి ప్రత్యేక సర్వీసులను కేటాయించారు.

రాయలసీమ వైపు వెళ్లే ప్రయాణికుల కోసం అనంతపురం, కడప, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, ప్రొద్దుటూరు, రాయదుర్గం, ధర్మవరం, హిందూపురం, పులివెందుల తదితర ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యాన్ని, వారి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్‌టీసీ విభిన్న రకాల బస్సు సర్వీసులను నడుపుతోంది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఇంద్ర ఏసీ బస్సులతో పాటు సాధారణ ప్రయాణానికి ఉపయోగపడే ఎక్స్‌ప్రెస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన నగరాల రూట్లలో సూపర్ లగ్జరీ బస్సులను నడిపిస్తోన్నారు.
పండుగ వేళల్లో చివరి నిమిషంలో టికెట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు తమ సీట్లను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా నడిచే ఈ వినాయక చవితి ప్రత్యేక సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సూచించారు.













Click it and Unblock the Notifications
