వైరల్ వీడియో: సచివాలయ ఉద్యోగులపై ఎంపీడీఓ ఫైర్
అమరావతి: గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు, నిరసన ప్రదర్శనల పట్ల ప్రజలు, అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఉద్యోగాల్లో చేరిన రెండు సంవత్సరాల్లోనే ఆందోళనలను చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఉపాధి అవకాశాలను వెదుక్కుంటూ ఊరిని, కన్నవారిని వదిలేసి ఏ నగరానికో వలస వెళ్లకుండా.. ఉన్న చోటే లక్షలాది మందికి ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించిందని, ఈ రెండేళ్లలోనే ధర్నాలకు దిగడం మంచిది కాదంటూ అభిప్రాయపడుతున్నారు.

ఎంపీడీఓ స్ట్రాంగ్ వార్నింగ్..
ఉద్యోగాలు రానంత సేపు రాలేదు అంటూ బాధపడతారు.. వచ్చిన తరువాత నిరసనలంటూ ప్రవర్తిస్తారంటూ ఎంపీడీఓ హరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల్లో చేరిన కొత్తలోనే పే స్కేల్స్ కావాలంటూ డిమాండ్ చేయడం సరికాదని అన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగులే ఇలా డిమాండ్ చేస్తే.. ఎంపీడీఓలమైన తామేం కావాలని ప్రశ్నించారు. గ్రూప్-1 క్యాడర్స్‌కు చెందిన 40 మంది ఉద్యోగులు ఉన్నారని, సచివాలయ ఉద్యోగుల్లా ఒక్క పరీక్ష రాసి తాము ఉద్యోగాలు తెచ్చుకోలేదంటూ మండిపడ్డారు.

కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా?
మిగిలిన ఎంపీడీఓల సంగతి తనకు తెలియదని, తాను మాత్రం ఇలాంటి నిరసనలను గట్టిగా వ్యతిరేకిస్తోన్నానని తేల్చి చెప్పారు. సచివాలయ ఉద్యోగులతో పాటు తన ప్రొబేషన్ కూడా ఇంకా డిక్లేర్ కాలేదని స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగులు ఎన్ని శాఖలను పర్యవేక్షిస్తున్నారంటూ నిలదీశారు. కోర్టు కేసులను పరిష్కరించుకోవాల్సినంత తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు కోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోతే పీకకు చుట్టుకునేంతటి తీవ్ర సమస్యలు ఉన్నాయా అని నిలదీశారు.

టెలికాన్ఫరెన్సులు ఉన్నాయా?
సమాచార హక్కు చట్టానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యతను సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారా?, జిల్లా ఉన్నతాధికారులతో తరచూ జరిగే టెలికాన్ఫరెన్స్ వంటివి ఉన్నాయా? అని ప్రశ్నించారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి రోజూ తాము కనీసం మూడు నుంచి నాలుగు టెలికాన్ఫరెన్స్‌లను స్వీకరిస్తుంటామని అన్నారు. రెండు సంవత్సరాల్లో అంత పెద్ద కష్టం ఏమొచ్చింది? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే..
నిరసనల్లో భాగంగా తనకు ఏదైనా వినతిపత్రం ఇవ్వాలనుకుంటే.. ఇచ్చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. అంతే తప్ప నిరసన ప్రదర్శనలు చేస్తూ కాలక్షేమం చేయొద్దంటూ ఆదేశించారు. మండలం పరిధిలో ఉన్న 10 గ్రామ పంచాయతీలను మధ్యాహ్నం నుంచి సమీక్షిస్తానని తేల్చి చెప్పారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందినా ఊరుకోబోనని హెచ్చరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. దీన్ని షేర్ చేస్తోన్నారు.

ఎంపీడీఓ తీరు పట్ల హర్షం..
సచివాలయాల ఉద్యోగులకు ఎంపీడీఓ వార్నింగ్ ఇవ్వడాన్ని పలువురు సమర్థిస్తున్నారు. ఆమెను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. కాస్త కటువుగానైనా సరే.. వాస్తవ పరిస్థితులను వారికి వివరించారని ప్రశంసిస్తున్నారు. ఆందోళనలు చేస్తోన్న సచివాలయ ఉద్యోగులను వెంటనే తొలగించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తోన్నారు. ఉద్యోగాలు రానంత సేపూ ప్రభుత్వాన్ని తిట్టి పోస్తారని, వాటిని కల్పించిన తరువాత కూడా డిమాండ్ల పేరుతో మళ్లీ అదే ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన చేయడం సరికాదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications