గంజాయి సాగు చేస్తే తప్పేంటి? ఏపీ గంజాయి సాగు ధ్వంసం చేస్తున్న అధికారులపై గిరిజనుల తిరుగుబాటు !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగును, అక్రమ రవాణాను అరికట్టడం కోసం ఏపీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. విశాఖ ఏజెన్సీ కేంద్రంగా సాగవుతున్న గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారు. గంజాయి పంట ధ్వంసం చేస్తున్న అధికారులకు గిరిజనులు షాక్ ఇస్తున్నారు. గంజాయి సాగు చేస్తే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

గంజాయి సాగు ధ్వంసం చేస్తున్న అధికారులు .. ఆపరేషన్ పరివర్తన
దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే అని చర్చ జరుగుతున్న సమయంలో విశాఖ మన్యంలో గంజాయి సాగుపై దృష్టి సారించిన ఏపీ సర్కార్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. గంజాయి సాగును, స్మగ్లింగ్ ను అరికట్టడం కోసం కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయిని ధ్వంసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో విశాఖ మన్యంలో గిరిజనులకు అవగాహన కల్పిస్తూ, సాగు చేసిన గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారు.

గంజాయి తోటల ధ్వంసానికి వెళ్ళిన అధికారులకు గిరిజనుల షాక్
గంజాయి తోటల విధ్వంసాన్ని గిరిజనులు వ్యతిరేకిస్తున్నప్పటికీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బుధవారం నాడు విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం బొయితిలి పరిసర ప్రాంతాలలో గంజాయి సాగు చేస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లారు. దీంతో గంజాయి తోటలు ధ్వంసం చేయడానికి వచ్చిన అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. గంజాయి ధ్వంసానికి రంగంలోకి దిగిన తొలినాళ్ళలోనే అధికారులకు షాక్ ఇచ్చారు.

పంట ధ్వంసం చేస్తామంటే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
విశాఖ మన్యంలో గంజాయి పంట ధ్వంసం చేసేందుకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులకు బంగారం తాకట్టు పెట్టి మరీ గంజాయి సాగుపై పెట్టుబడి పెట్టామని, ఈ ఒక్కసారికి వదిలేయాలని వేడుకున్న గిరిజన మహిళలు వచ్చే ఏడాది నుండి సాగు చెయ్యబోమని అధికారులతో చెప్పారు. ఒకవేళ ఈ ఏడాది పంట ధ్వంసం చేస్తామంటే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకపక్క అధికారులతో గిరిజన మహిళలు చర్చలు జరుపుతుండగానే ఎక్సైజ్ పోలీసుల బృందం గంజాయి సాగును ధ్వంసం చేస్తూ ముందుకు వెళ్ళడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

అధికారులపై గిరిజనుల తిరుగుబాటు
ఎక్సైజ్ పోలీసులు తమ ప్రాంతంలోకి రావటాన్ని అడ్డుకున్న మహిళలు, అధికారులను కొట్టినంత పని చేశారు. వారి వాహనాలను కిందపడేసి అధికారులపై తిట్ల దండకం అందుకున్నారు. కర్రలు, రాళ్లతో అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు. ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోవాలని లేనిపక్షంలో జీపులను తగలబెడతాం అని హెచ్చరించారు. స్థానిక సిఐ తోపాటు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాజీరావు గిరిజనులకు ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా కూడా వారు వినిపించుకోలేదు.

గంజాయి పండిస్తే తప్పేంటి అంటూ నిలదీత
తమ తండాలలోకి ఎక్సైజ్ అధికారులు రావడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసిన గిరిజనులు గంజాయి పండిస్తే తప్పేంటి అంటూ నిలదీశారు. గంజాయి సాగు చేస్తున్న గిరిజనులంతా ఒక్కసారిగా అడ్డం తిరగడంతో ఎక్సైజ్ అధికారులు అక్కడి నుండి వెనుదిరిగారు. ఒకపక్క ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు నిర్దేశించిన క్రమంలో, అధికారులకు విశాఖ మన్యంలో సాగుచేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేయడం పెద్ద తలనొప్పిగా తయారైంది.












Click it and Unblock the Notifications