ఏపీలోని ఆ నాలుగు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్-విశాఖ వాతావరణ కేంద్రం వార్నింగ్..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో నిన్నటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, ఇంకా చెప్పాలంటే వీటి వల్ల ఆకస్మిక వరదలు కూడా రావొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీంతో ఆయా జిల్లాల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటలలుప నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశమున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విశాఖతో పాటు విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వీటి వల్ల వరదలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు కోరారు. ఈ నాలుగు జిల్లాల్లో వచ్చే 24 గంటలు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

భారీ వర్షాలతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ జీవీఎంసీ మరింత అప్రమత్తమైంది. కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్న మేయర్ హరి వెంకట కుమారి.. అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. వరదలు, భారీ వర్షాల వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 18004250009 టోల్ ఫ్రీ నంబర్ కి సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. ఇప్పటికే నగరంలో 184 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ మేయర్ తెలిపారు.












Click it and Unblock the Notifications