• search

పాత టైర్ల వ్యాపారంతో ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎదిగిన మహిళ...

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఆమె వృత్తిరీత్యా లాయర్...కాని పరిస్థితులు ఆమెని వ్యాపారం వైపు నెట్టాయి...పైగా ప్రవేశించింది కూడా తనకు ఏమాత్రం సంబంధం లేని పాత టైర్ల వ్యాపారంలోకి. అయితే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన...పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న ఆకాంక్ష...పర్యవరణ పరిరక్షకురాలిగా ఉండాలన్న ప్రవృత్తి ఆమెని ఈ విభిన్న వ్యాపారాన్ని ఎంచుకునేలా చేశాయి. వీటిన్నిటికి తనకు స్వతహాగా వచ్చిన ఆత్మవిశ్వాసం,పట్టుదల,నిర్విరామ కృషి తోడవడంతో...ఇంకేముంది...మొదట్లో కొంత మొండికేసినా ఆ తరువాత విజయమే ఆమె వెంటబడింది. తనతో లాభాలే కాదు అపారమైన పేరుప్రఖ్యాతులను వెంటబెట్టుకొని తీసుకొచ్చింది. ఉత్తమ పారిశ్రామికవేత్తగా యావత్ ప్రపంచం ఆమెని గుర్తించేలా చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా...అయితే ఈ డిఫరెంట్ సక్సెస్ స్టోరీ చదవాల్సిందే మరి...

  ఈ సక్సెస్ ఫుల్ వుమన్ ఇండస్ట్రియలిస్ట్ పేరు నీతిపూడి స్వర్ణలత...స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా...సహచర విద్యార్ధితో ప్రేమ వివాహం... ఆ తరువాత ఎదురైన కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా విభిన్నమైన వ్యాపారంలోకి రంగప్రవేశం...అనంతరకాలంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్త నుంచి ఉత్తమ పారిశ్రామికవేత్త దాకా ఎదిగిన వైనం...ముఖ్యమంత్రి చేతుల మీదుగా బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు అందుకోవడం... ఈ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...

  ఊరు...పేరు...చదువు...

  ఊరు...పేరు...చదువు...

  నా పేరు నీతిపూడి స్వర్ణలత...మా స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా జగన్నాథపురం. మా నాన్నగారి పేరు నీతిపూడి గంగరాజు..ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్ గా పనిచేశారు. మదర్ ఎస్తేరు రాణి...గృహిణి...వారి ఆదర్శ, అభ్యుదయ భావాల ప్రభావం నాపై చాలా ఉంది. ఆ ప్రభావమే నేను న్యాయ విద్యను ఎంచుకోవడానికి కారణం. నేను ఆంధ్రా యూనివర్శిటీలో ఎల్ ఎల్ బి పూర్తి చేశాను.న్యాయవిద్య అభ్యసించేప్పుడే నా సహవిద్యార్థి కరుణ కుమార్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకి దారి తీసింది. ఆ తరువాత ఎల్ ఎల్ బి చదువుతుండగానే పెళ్లి చేసుకున్నాం. పెళ్లి అయ్యాక ఎదురయ్యే అనేక సమస్యల్ని అధిగమించి ఇద్దరం న్యాయవిద్యను పూర్తిచేశాం.

  ముందు మావారి సక్సెస్...

  ముందు మావారి సక్సెస్...

  మా వారి లక్ష్యం న్యాయమూర్తి కావడం. అందుకే పట్టుదలతో చదివి టార్గెట్ చేధించారు. మా పెళ్లయిన ఐదేళ్ల తరువాత అంటే 2005 సంవత్సరంలో ఆయన ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ అయ్యారు. ప్రస్తుతం రాజోలు లో పనిచేస్తున్నారు.

  నాకు లాయర్ గా రాణించాలని...

  నాకు లాయర్ గా రాణించాలని...

  మావారు న్యాయమూర్తి కావడం, మొదట్లో చాలాకాలం పాటు మెజిస్ట్రేట్ గా సింగిల్‌ కోర్టులున్నచోట్ల పనిచేయడం వల్ల నాకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అవకాశం లేకుండాపోయింది. కారణం భర్త న్యాయమూర్తిగా ఉన్న కోర్టులో భార్య వాదించకూడదు. ఈ నిబంధన ఉంది. దీంతో నేను న్యాయవాద వృత్తికి దూరమవ్వాల్సి వచ్చింది. ఎంతో ఇష్టంగా చదివిన చదువుకి దూరమవ్వాల్సి వచ్చిందని చాలా బాధ అనిపించేది. అయినా మా ఆయన కోసం నాకెంతో ఇష్టమైన లాయర్ వృత్తిని శాశ్వతంగా వదిలేసుకోవాలని నిర్ణయించుకున్నా

  వ్యాపారంలోకి ఇలా...

  వ్యాపారంలోకి ఇలా...

  ఆ తర్వాత బాగా ఆలోచించాక సొంతంగా ఏదైనా చేయాలనుకున్నా. లాయర్ తరువాత నా ఆప్షన్ పారిశ్రామికవేత్త అవ్వాలని...అయితే ప్రకృతి ప్రేమికురాలిగా...పర్యావరణానికి మేలుచేసే పరిశ్రమనే స్థాపించాలనే నిర్ణయానికి వచ్చా...

  టైర్ల వ్యాపారం లోకి...ఇలా...

  టైర్ల వ్యాపారం లోకి...ఇలా...

  సో..ఈ దిశలో ఆలోచించాక టైర్ల వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నా...వ్యాపారం ఏంటో నిర్ణయించుకున్నాక అప్పటి మా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ నాయక్‌ను కలిసి నా ఆలోచనలు చెప్పా. ఆయన అన్నీ విన్నాక పనికిరాని టైర్లతో రబ్బరు పొడి తయారుచేసే పరిశ్రమ పెట్టొచ్చని, అది పర్యావరణనానికి మేలు చేస్తుందని చెప్పారు. నాకూ ఆ సూచన చాలా నచ్చింది. అంతే డిఐసి జిఎం సలహా ప్రకారం పాత టైర్ల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టేశా...

  టైర్ల వ్యాపారమా?....

  టైర్ల వ్యాపారమా?....

  వాడేసిన టైర్లు పడేసినా అవి సుమారు 40 ఏళ్ల పాటు భూమిలో,మట్టిలో కలిసిపోవు. అయితే ఈ పాత టైర్ల నుంచి పొడి తీస్తే అది ఎన్నో విధాలా ఉపయోగపడుతుంది. ఈ టైర్ల పొడిని తారుతో కలిపి రహదారులు, విమానాశ్రయ రన్‌వేల నిర్మాణంలో ఉపయోగించడం వాటిల్లో ఒకటి. దీన్నే తిరిగి టైర్ల తయారీలో వాడొచ్చని తెలుసుకున్నా...ఇది చాలా బాగుంటుందని నాకనిపించింది. నేనూ అదే చేయాలనుకున్నా. నా ఆలోచన చెప్పినప్పుడు కొందరేమో పాత టైర్ల వ్యాపారమా అని చులకనగా మాట్లాడారు. మరికొందరు నువ్వు జడ్జి గారి భార్యవైయుండి పనికిరాని టైర్లతో వ్యాపారం చేయడం ఏమిటి అన్నారు...ఇంకొందరు అసలు నువ్వు ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. వ్యాపారం అంటే లాభనష్టాలతో కూడుకున్నది...నష్టమొస్తే ఏం చేస్తావంటూ ఇలా హెచ్చరించిన వారిలో మిత్రులు, బంధువులు ఉన్నారు.

  భర్త ప్రోత్సాహం...

  భర్త ప్రోత్సాహం...

  అయితే నా ఆలోచనను మా వారూ, ఆయన స్నేహితులు ప్రోత్సహించారు. వ్యాపారానికి అవసరమైన పెట్టుబడిని రుణం ద్వారా సమకూర్చుకోవచ్చని అన్నారు. వారి ప్రోత్సాహంతో రుణంకోసం ప్రయత్నించా. చివరకు ఎస్‌ఎంఈసీసీ విభాగం నుంచి రుణం మంజూరయింది. ఆ తరువాత ఏపీఐఐసీ అధికారుల్ని సంప్రదిస్తే స్థలం కేటాయించారు.

  పరిశ్రమ ప్రారంభం...

  పరిశ్రమ ప్రారంభం...

  ముందు జాగ్రత్తగా వ్యవహరించి ఈ పొడి కొనుగోలుదారుల కోసం ప్రయత్నం చేశా. ఈ పొడిని కొనడానికి హింకాల్‌ అనే సంస్థ కూడా ముందుకు రావడంతో ఇక పరిశ్రమను ప్రారంభించేందుకు చురుగ్గా పనులు మొదలుపెట్టా. 2013 నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తిచేసి ‘ప్రిన్స్‌టన్‌ రబ్బర్‌ ఇండస్ట్రీస్‌' అనే పేరుతో సంస్థను ప్రారంభించా

  ఆదిలో నష్టాలే...

  ఆదిలో నష్టాలే...

  అయితే అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదా...ఉత్పత్తి పనులు అనుకున్న దానికన్నా ఆలస్యం అయ్యాయి. దీంతో మాతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ప్రత్యామ్నయం కోసం చూసుకోవడంతో వారి నుంచి వర్క్‌ ఆర్డర్‌ సమయానికి రాలేదు. అప్పుడు ఆ రబ్బరు పొడిని ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఈ రబ్బరుపొడిని కొనేవాళ్ల కోసం అన్వేషించా...అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఈ పొడిని ఎవరూ కొనేవారు కాదు. దీంతో తమిళనాడు, కేరళలోని టైర్ల తయారీ సంస్థలు ఈ పొడిని కొంటాయని తెలిసి వాళ్లను సంప్రదించా. చివరకు టీవీఎస్‌ సుందరం సంస్థ కొనడానికి ఒప్పుకుంది. అయితే విశాఖ నుంచి సరకును పాండిచ్చేరిలోని సుందరం సంస్థకు రవాణా చేయాలంటే కాస్త ఖర్చు ఎక్కువే. పైగా స్థానిక ధరకే సరఫరా చేయాలి. దీంతో మాపై ఎక్కువ భారం పడింది. లాభాలు లేవు. అయినప్పటికీ పరిశ్రమను ఖాళీగా ఉంచడం ఇష్టంలేక, మమ్మల్ని ప్రోత్సహించడానికి వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చిన టీవీఎస్‌ సంస్థకు సరకు అమ్మేవాళ్లం. 2015 వరకు ఇదే విధంగా వ్యాపారం కొనసాగింది.

  లాభాల బాట...

  లాభాల బాట...

  అయితే 2015లో హింకాల్‌తో పాటు మరికొన్ని సంస్థలూ మా టైర్ల పొడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో మా కష్టాలు కొంత తీరడంతో పాటు లావాదేవీలు ఊపందుకున్నాయి. ఇక ఆ తర్వాత ఆర్టీసీ ఆన్‌లైన్‌ వేలంలో పాత టైర్లను కొనుగోలు చేయడం వాటిని పొడిగా మార్చడం...మాకు మరి కొంత వెసులుబాటును ఇచ్చింది.

  ఉపాధి కల్పన...

  ఉపాధి కల్పన...

  ఇప్పుడు మా సంస్థ రోజుకు ఏడు టన్నుల రబ్బరు పొడిని తయారుచేసే స్థాయికి చేరుకుంది. మరోవైపు 50 మందికి ఉపాధి కల్పించగలుగుతున్నాం. లాభాల కన్నా ఇలా పర్యావరణ హితమైన పరిశ్రమను స్థాపించడం, కొందరికైనా ఉపాధి కల్పించగలగడం నాకు ఎంతో తృప్తి నిచ్చాయి. నేను ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎదగడంలో నా భర్త, పిల్లల ప్రోత్సాహం చాలా ఉంది.

   వివిధ రకాల ఉత్పత్తులు...

  వివిధ రకాల ఉత్పత్తులు...

  మేము ఉత్పత్తి చేసే రబ్బరు పొడితో మ్యాట్లూ,ఫ్లోర్లు,రబ్బర్ గ్రాస్,కార్పెట్స్, రబ్బర్ స్ట్రీట్స్, ఇలా వివిధ రబ్బరు ఉత్పత్తులు తయారుచేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాం..

  పురస్కారాలు...ఆహ్వానాలు...

  పురస్కారాలు...ఆహ్వానాలు...

  కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని పారిశ్రామికవేత్తలకు అవార్డులను బహూకరించగా నాకు ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా అవార్డు లభించడం ఎంతో సంతోషాన్నిచ్చింది..ఆ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకోవడం ఒక మధురానుభూతిగా గుర్తుండిపోయింది. ఊపించని విధంగా తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకూ హాజరయ్యే అవకాశం లభించడం, ఆ సదస్సులో పాలుపంచుకోవడం ఎప్పటికీ స్వీట్ మెమరీస్ అంటూ ముగించారు మన విజేత నీతిపూడి స్వర్ణలత...

  English summary
  visakhapatnam: Born in west godavi dist, she did her Bachelors degree in law . but now She is the C.E.O of KS Princeton Rubber Industries. this industry is the brain child and creation of Miss.N.Swarnalatha, mainly established as a marks women of ‘‘Women empowerment to generate employment’’ and to contribute to the Nation’s growth. Adding to this another objective behind establishing this factory is to conserve the nature, which is established on 2012.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more