Visakhapatnam Lok sabha: బొత్స ఝాన్సీని ఢీకొట్టే సత్తా బాలయ్య అల్లుడుకుందా..?
Botsa Jhansi:వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖను పరిపాలన రాజధానిగా కచ్చితంగా చేస్తామని సీఎంగా తన ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు. ఇప్పటి వరకు విశాఖ అంశం కాస్త సైలెంట్‌గా ఉన్నప్పటికీ... సీఎం జగన్ ప్రకటనతో మరోసారి వార్తల్లో సాగరనగరం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది.అంతేకాదు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు బడా కంపెనీలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వచ్చిన కంపెనీలకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయసహకారాలు అందాయి. రానున్న కంపెనీలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగవంతంగా కావాల్సిన అన్ని అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇలాంటి సమయంలో విశాఖపట్నం ఎంపీగా వైసీపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీని గెలిపిస్తే, ప్రజలకు అందుబాటులో ఉండటమే కాదు, సమస్యలపై పార్లమెంటులో ధైర్యంగా ప్రస్తావించి , వాటిని పరిష్కరించడంలో చొరవ చూపిస్తారనే పాజిటివ్ ఒపీనియన్ ప్రజల్లో నెలకొంది. గతంలో బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర సమస్యలపై స్పందించి, వాటిపై పార్లమెంటులో పోరాడి పరిష్కరించిన ఘనత బొత్సా ఝాన్సీకి ఉందని విశాఖ పరిధిలోని ఓటర్లు చర్చించుకుంటున్నారు.ఒకప్పుడు రైల్వే గేట్లు సరిగా ఉండేవి కావు, అలాంటి ఎన్నో అంశాలు పార్లమెంటులో ప్రస్తావించి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా రైల్వే గేట్లు పెట్టించి, ప్రమాదాలు జరగకుండా అరికట్టగలిగారనే విషయాన్ని ఇక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

ఇక బొత్స ఝాన్సీ ఉన్నత చదువులు చదివారు. ఉత్తరాంధ్రలోనే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకోవడం వల్ల ఆమెకు ఆ ప్రాంతం పట్ల ఆ ప్రాంత సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.గతంలో కూడా బొత్స ఝాన్సీ పార్లమెంటులో లేవనెత్తిన సమస్యల గురించి విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఆ సమస్య యొక్క తీవ్రతపై లోక్‌సభలో ప్రస్తావించిన తీరు, ఆ సమస్యను పరిష్కరించిన తీరు భేష్ అని కొనియాడుతున్నారు. ఇదే ఆమె గెలుపునకు బాటలు వేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఇక విశాఖ లోక్‌సభకు టీడీపీ-జనసేన-బీజేపీ బలపరిచిన అభ్యర్థి భరత్ విషయానికొస్తే ఝాన్సీని ఢీకొట్టేంత సామర్థ్యం లేదనే చెప్తున్నారు విశ్లేషకులు.ఇక ప్రచారంలో కూడా భరత్ వెనకపడి ఉన్నట్లు తెలుస్తోంది. బొత్సా ఝాన్సీపై గెలిచేంత దమ్ము సత్తువా శ్రీభరత్‌కు లేవని వైసీపీ నాయకులు చెబుతున్నారు. బాలయ్యకు అల్లుడనే క్వాలిఫికేషన్ తప్ప.. శ్రీ భరత్‌కు అర్హతలేమున్నాయని ప్రశ్నిస్తున్నారు.విశాఖ రాజధాని అయితే ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై బొత్స ఝాన్సీ స్పష్టమైన ఆలోచన అవగాహన కలిగి ఉన్నారని వైసీపీ చెబుతోంది. ఇప్పటికే బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకెళుతున్నారని గెలుపు ఝాన్సీదే అవుతుందని స్థానిక వైసీపీ క్యాడర్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications