Visakhapatnam South Assembly Election 2024 Results LIVE: హ్యాట్రిక్ ఖాయమా ? మార్పు తప్పదా ?
విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ప్రధాన పోటీ వైసీపీ, జనసేన అభ్యర్ధుల మధ్యే జరిగింది. వైసీపీ తరఫున వాసుపల్లి గణేష్ కుమార్, జనసేన తరఫున వంశీకృష్ణ యాదవ్ బరిలోకి దిగారు. రాష్ట్రంలో వైసీపీ, కూటమి మధ్య జరిగిన పోరు ఎఫెక్ట్ ఇక్కడ కూడా కనిపించింది. అయితే ఇందులో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
విశాఖపట్నం సిటీ అర్బన్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో ఒకటైన దక్షిణ అసెంబ్లీ సీటులో మత్సకారులతో పాటు ఇతర కులాల ప్రభావం ఉంది. ఇక్కడ 2014, 2019లో వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్.. అనంతరం వైసీపీలోకి ఫిరాయించారు. ఈసారి వైసీపీ టికెట్ పై వాసుపల్లి పోటీ చేశారు. అయితే టీడీపీ హవా ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కు ఉన్న సొంత సామాజిక వర్గ బలం అనుకూలంగా ఉంది. కరోనా సమయంలో పనిచేశారన్న సానుకూలత, వైసీపీ పథకాలపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.

అటు కూటమి మద్దతుతో బరిలోకి దిగిన జనసేన అభ్యర్ధి వంశీకృష్ణ యాదవ్ కు నగరంలో అర్బన్ ఓటర్లతో పాటు యాదవ, బ్రాహ్మణ సామాజిక వర్గాలు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో ఉన్న యువత జనసేనవైపు మొగ్గడం కూడా వంశీకి కలిసి వచ్చింది. అయితే కొత్త అభ్యర్ధి కావడం, పోల్ మేనేజ్ మెంట్ ఏ స్ధాయిలో చేసుకున్నారన్న దానిపై వంశీకృష్ణ విజయం ఆధారపడి ఉంది. కూటమిలో టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ కావడం, విశాఖలో వైసీపీపై ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. సీతంరాజు సుధాకర్, ద్రోణం రాజు వంటి వారు టీడీపీవైపు మొగ్గడం వంశీకి ప్లస్ కానుంది.
వైసీపీలో గ్రేటర్ విశాఖ మేయర్ పదవి ఆశించిన వంశీకృష్ణ.. అది దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా దానికి రాజీనామా చేసి మరీ జనసేనలో చేరిపోయారు. యాదవ సామాజిక వర్గం, యువత, కూటమి పార్టీల నుంచి లభించిన మద్దతు వంశీకి ఎడ్జ్ ఇస్తున్నాయి. అయితే వైసీపీ పథకాల ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం వాసుపల్లి గణేష్ కనీస మెజార్టీతో బయటపడొచ్చని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications