'వైసీపీ దెబ్బకు సీటు చేంజ్.. స్పీకర్ కు ఓపిక ఎక్కువ'
హైదరాబాద్ : ప్రత్యేక హోదా అంశంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఓవైపు అధికార పక్ష సభ్యులు, బీజేపీ నేతలు ప్యాకేజీపై స్పందించే ప్రయత్నం చేస్తుంటే.. స్పీకర్ పోడియం వద్ద చేరిన వైసీపీ నేతలు సభను స్తంభించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పది నిమిషాల పాటు వాయిదా పడ్డ సభ.. తిరిగి ప్రారంభమైన తర్వాత అదే కూడా పరిస్థితి నెలకొంది.
అసెంబ్లీలో పెద్ద ఎత్తున నినాదాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. 'హోదా ఆంధ్రుల హక్కు. ఓటుకు నోటుకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు రాజీనామా చేయాల్సిందే' అంటూ అసెంబ్లీని హోరెత్తించారు. వి వాంట్ జస్టిస్.. ఏపీని ముంచిన చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.

అయితే వైసీపీ నేతల గందరగోళం నడుమనే.. టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. వైసీపీ దెబ్బకు తాను ఏకంగా సీటే మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. వైసీపీ నేతల నిరసనతో తనకు తన స్థానంలో నిలబడి మాట్లాడే అవకాశం లేకుండా పోయిందన్నారు. అందుకే మరో స్థానంలో కూర్చోని ప్యాకేజీపై మాట్లాడాల్సి వస్తోందన్నారు.
సభలో వైసీపీ నేతల తీరును తప్పుబడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలందరిని తక్షణం సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ఇంత నీచమైన ప్రతిపక్షం గందరగోళం చేస్తున్నప్పటకీ స్పీకర్ ఓపిగ్గా పనిచేస్తోన్నారని, ఇంత ఓపిగ్గా పనిచేసే స్పీకర్ ను తాను ఇంకెక్కడా చూడలేదన్నారు. స్పీకర్ ఓపికకు సభలోనే ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వైసీపీ గందరగోళంతో మరోసారి సభ వాయిదా పడింది.












Click it and Unblock the Notifications