చంద్రబాబు జైల్లో విజన్ 2047 ప్లాన్స్.. యనమల వ్యాఖ్యలకు సాయిరెడ్డి సెటైర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కాయి. అక్రమంగా కేసులో ఇరికించారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నిన్న చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో ములాఖత్ అయ్యారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని, తప్పులు చేసిన నాయకులే ఆయనను ఈ కేసులో ఇరికించారని వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులతో ఈ ప్రభుత్వం చంద్రబాబును వేధిస్తోందని జైల్లో ఆయన సంతోషంగా లేరని పేర్కొన్నారు.

పార్టీ కార్యకర్తల గురించి ఆయన అడుగుతున్నారని జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రజల గురించే ఆలోచన అని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం వల్ల ప్రజలంతా కష్టాలు ఎదుర్కొంటున్నారని, టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని చంద్రబాబు బాధపడుతున్నారని యనమల రామకృష్ణుడు చెప్పారు. అంతేకాదు తన అరెస్టును వ్యతిరేకిస్తూ తనకు సంఘీభావం తెలిపిన జాతీయ నేతలకు కృతజ్ఞతలు చెప్పమన్నారని యనమల రామకృష్ణుడు తెలిపారు.

తాజాగా యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ వేశారు. చంద్రబాబు గారు జైల్లో కూర్చుని విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారని, జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయంప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిస్తున్నారు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్స్ ఏంటి రామా కృష్ణా అంటూ సెటైర్లు వేశారు.
చంద్రబాబుకు జైల్లో ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదని, తన బెయిల్ గురించి మాత్రమే భయపడుతున్నారని, కానీ యనమల రామకృష్ణుడు బయటికి వచ్చి బిల్డప్ కోసం చంద్రబాబుకు హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారన్నారు. జైల్లో కూర్చుని చంద్రబాబు విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారని చెబుతున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి.












Click it and Unblock the Notifications