వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు సంచలనం..!!
అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో దాఖలైన పిటీషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇవ్వాళ దీనిపై విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఇదివరకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తును పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులపై నిందితులు కేసులు నమోదు చేస్తోన్నారని పేర్కొన్నారు.

సుప్రీంలో పిటీషన్..
వైఎస్ వివేకా హత్యకేసుపై విచారణ ఆశించిన వేగంగా కొనసాగట్లేదని సునీత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుపై దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, సీబీఐ, డీజీపీలను చేర్చారు. ఈ పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారితో కూడిన ధర్మాసనం ఇవ్వాళ విచారణ చేపట్టింది. కేసు వివరాలను అడిగి తెలుసుకుంది.

అక్టోబర్ 14కు వాయిదా..
అనంతరం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీబీఐ అధికారులకు నోటీసులను జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. 2019 మార్చి 15వ తేదీన వివేకానంద రెడ్డి పులివెందులలోని తన ఇంట్లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన చోటు చేసుకుని మూడు సంవత్సరాలైనప్పటికీ దర్యాప్తు ముందుకు సాగట్లేదని, అసలు హంతకులు ఎవరనేది తెలియరావట్లేదని సునీత చెబుతున్నారు.

వేగంగా కొనసాగించేలా..
దర్యాప్తు వేగవంతం చేయడంలో భాగంగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేకా హత్యకేసుపై సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ అధికారులు స్వీకరించారు. కొన్ని సందర్భాల్లో సీబీఐ అధికారులపైనే కేసులు నమోదవుతోన్నాయని, విచారణ ఆశించిన స్థాయిలో వేగంగా కొనసాగట్లేదని సునీత చెబుతున్నారు. వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఛార్జ్‌షీట్..
సిట్ కూడా దీన్ని ఛేదించలేకపోయింది. దీనితో వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సునీత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్‌ను విచారించిన హైకోర్టు 2020 మార్చి 11వ తేదీన సీబీఐకి దీన్ని అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2020 జులై 18న కడపలో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు ఇప్పటి వరకు 246 మంది సాక్షులను విచారించారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications