vizag lands scam : సిట్ నివేదికలో సంచలనాలు- 400 ఎకరాల కబ్జా- త్వరలో వెనక్కి
గత ప్రభుత్వాల హయాంలో విశాఖ నగరంలో చోటు చేసుకున్న భూముల కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తమ పని పూర్తి చేసింది. త్వరలో ప్రభుత్వానికి ఈ మేరకు నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతోంది. అయితే సిట్ దర్యాప్తు నివేదికలో పలు సంచలన అంశాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు పరస్పరం కబ్జాల ఆరోపణలు చేసుకున్న ఈ స్కాంలో సంచలనాలు బయటికొస్తే అది విపక్షానికి ఇబ్బందిగా మారడం ఖాయం. దీంతో సిట్ నివేదికపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. ఈ నివేదికలో సిట్ విశాఖ నగరంలో దాదాపు 400 ఎకరాలు కబ్జాలో ఉన్నట్లు తేల్చడం మరో సంచలనంగా మారబోతోంది.

విశాఖలో భూముల స్కాం...
ఏపీలోని సాగర తీరంలో ఉన్న సుందర నగరం విశాఖలో భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని దశాబ్దాల క్రితమే భూముల ఆక్రమణలు మొదలయ్యాయి. ఖాళీ స్ధలం కనిపిస్తే చాలు కబ్జా చేయడం అక్రమార్కులకు అలవాటుగా మారింది. వీరిలో గత ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో ఉన్న వాళ్లు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు, చివరికి అధికారులు కూడా వారితో కుమ్మక్కై ఈ భూముల దందా సాగించారు. దీంతో సాగరతీర నగరం కాస్తా దారుణంగా కుంచించుకుపోయిది. ఇప్పుడు రాజధాని చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో కీలకమైన ప్రభుత్వ భవనాలు దొరకడం లేదు. దీంతో ప్రభుత్వానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారిపోయింది.

సిట్ దర్యాప్తు నివేదిక సిద్ధం
వైసీపీ సర్కారు అధికారంలోకి రాగానే విశాఖ నగరం అభివృద్దిపై దృష్టిసారించింది. అభివృద్ది చేయాలంటే భూములు తప్పనిసరి. వందల ఎకరాలు కబ్జాకోరుల చేతుల్లో ఉంటే ప్రభుత్వానికి భూములు ఎక్కడి నుంచి వస్తాయి . దీంతో అక్రమాలను తవ్వితీసే పనిలో పడింది. విశాఖలో గతంలో సాగిన భూదందా ఆరోపణలు ఉండనే ఉన్నాయి. వీటిపై అప్పటికే సిట్, సీఐడీతో పాటు పోలీసులు కూడా పలు దర్యాప్తులు చేసినా ఫలితం లేదు. దీంతో కొత్తగా మాజీ ఐపీఎస్ విజయ్ కుమార్ నేతృత్వంలో మరో సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ బృందం తాజాగా దర్యాప్తు పూర్తి చేసింది. తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమవుతోంది.

సిట్ నివేదికలో సంచనాలు
విశాఖలో అడ్డూ అదుపూ లేకుండా సాగిన భూముల కబ్జాపై సిట్ రూపొందించిన నివేదికలో పలు సంచలనాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వాల హయాంలో నేతలు సాగించిన భూ దందాకు సిట్ నివేదిక అద్దం పట్టేలా ఉందని తెలుస్తోంది. తాజాగా భూముల స్కాం నివేదికపై మీడియాతో మాట్లాడిన సిట్ అధిపతి విజయ్‌కుమార్.. నగరంలో భూముల కబ్జాలు, రికార్డుల తారుమారుపై ప్రజలు, అధికారులతో పాటు సంబంధిత వర్గాల అభిప్రాయాలు సేకరించామన్నారు. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ లభించగానే దీన్ని ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.

విశాఖలో దాదాపు 400 ఎకరాల కబ్జా
విశాఖపట్నంలో గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భూముల అక్రమాలను గుర్తించిన సిట్ తన నివేదికలో వీటిని సమగ్రంగా పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం విశాఖలో దాదాపు 350 నుంచి 400 ఎకరాల భూములు ఆక్రమణకు గురయినట్లు తేల్చారు. ఇందులో అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, కీలక స్ధానాల్లో ఉన్న వారు కూడా ఉన్నారు. దీంతో ఈ నివేదిక బయటికి రాగానే పలు సంచలనాలకు దారి తీసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కబ్జాదారుల ఆక్రమణలో ఉన్న 400 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుటుందని సిట్ అధిపతి విజయ్‌కుమార్ వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే రాజధానికి మరో 400 ఎకరాలు అందుబాటులోకి రాబోతున్నాయన్నమాట.