ప్లాన్ ప్రకారమే మంత్రి రోజాపై జనసేన దాడి - ఇదీ జరిగింది..!!
విశాఖ విమానాశ్రయంలో మంత్రి రోజా పైన జరిగిన దాడి గురించి నగర పోలీసు కమిషనర్ కీలక అంశాలను వెల్లడించారు. ఈ నెల 15న విశాఖ నగరంలో పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి సీపీ శ్రీకాంత్ వివరించారు. నాటి పరిణామాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. పోలీసుల పైన జనసేన నేతల ప్రచారాన్ని ఖండించారు. ఉద్దేశ పూర్వకంగానే విమానాశ్రయంలో దాడులు జరిగినట్లుగా తమ విచారణలో తేలిందని స్పష్టం చేసారు. మంత్రి రోజా పై జనసేన నేతలు దాడి చేయాలని భావించారని..ఆ దాడిలో మంత్రి పీఏ దిలీప్ కు గాయాలయ్యాయని సీపీ వెల్లడించారు.
ఈ నెల 13న పవన్ కళ్యాణ్ విశాఖ వస్తున్న విషయం పార్టీ నాయకులు చెప్పారని, అయితే ర్యాలీ..జనసమీకరణ అంశాలను చెప్పలేదని సీపీ చెప్పుకొచ్చారు. విశాఖ గర్జన ముగించుకొని వెళ్తున్న మంత్రులు రోజా.. జోగి రమేష్.. విడదల రజనీతో పాటుగా టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి విమానాశ్రయం చేరుకోగా, పెద్దఎత్తున అక్కడకు చేరుకున్న జనసేన కార్యకర్తలు మంత్రులపై ఉద్దేశ పూర్వకంగా దాడికి పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. పథకం ప్రకారమే దాడులు చేసారని, అందులో పెందుర్తి సీఐ నాగేశ్వర రావుకు గాయాలయ్యాయని వివరించారు. మొత్తం ఆరు కేసులు నమోదు చేసి వంద మందిని అరెస్ట్ చేసామన్నారు.

ర్యాలీకి అనుమతులు లేవని, సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పినా కొనసాగించారని వివరించారు. పవన్ రాక మూడు గంటలు ఆలస్యమైందని..మంత్రులు విమానాశ్రయం చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగిందన్నారు. అయితే, అవసరమైన భద్రతా సిబ్బందిని అక్కడ మొహరించామన్నారు.పవన్ కళ్యాన్ ను నగరం విడిచి వెళ్లమని పోలీసులు సూచించలేదన్నారు. దీని పై కొందరు అసత్య ప్రచారం చేసారని సీపీ వివరించారు. పవన్ విషయంలో పోలీసులు తమ పరిధిలోనే వ్యవహరించారని, కొందరు ఉద్దేశ పూర్వకంగా సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేసారని విశాఖ పోలీసు కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications