ఆగస్టు 1న వినాయక చవితి ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్: ఆ బెల్ట్ మొత్తం కవర్
గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర, కొంకణ్ రీజియన్, గోవా ప్రాంతాలకు వెళ్లేవారి కోసం సెంట్రల్ రైల్వే భారీ ఎత్తున ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. పండుగ వేళ ప్రయాణికుల రద్దీని అధిగమించడంలో భాగంగా మొత్తం 246 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ముంబై, కొంకణ్ కోస్ట్, గోవా, పూణేలను కలుపుతూ వివిధ స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనున్నాయి.
ఈ మేరకు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ స్వప్నిల్ ఓ ప్రకటన విడుదల చేశారు. వీటిల్లో ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉన్న 184 మిక్స్‌డ్ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 62 అన్ రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లను నడపించనుంది సెంట్రల్ రైల్వే. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్- 98, లోకమాన్య తిలక్ టెర్మినస్- 76, పూణే- 10 రైళ్లను కేటాయించారు.

టిక్కెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 1న ప్రారంభం కానుంది. ప్రయాణికులు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్లు, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, అధికారిక యాప్‌ల ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఐఆర్సీటీసితో పాటుగా రైల్ వన్ పోర్టల్‌లో కూడా రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి. రిజర్వేషన్ సౌకర్యం లేని ప్రయాణికులు జనరల్ టిక్కెట్ల కోసం యూటీఎస్ యాప్‌ను ఉపయోగించవచ్చు. కొంకణ తీర ప్రాంతం మొత్తం కవర్ అయ్యేలా ఈ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. గోవా సరిహద్దులకు సమీపంలో ఉంటుందీ సావంత్ వాడి.
ముంబై, నవీ ముంబై, పుణే వంటి ప్రధాన నగరాలలో ఉపాధి పొందుతున్న కొంకణ్ ప్రాంత వాసులు గణేష్ చతుర్థి వేడుకలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. పండుగ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే కుటుంబ సమేతంగా తమ స్వగ్రామాలకు బయలుదేరి వెళ్తుంటారు. దీనివల్ల సాధారణ రోజులతో పోలిస్తే వినాయక చవితి సమయంలో కొంకణ్ వైపు వెళ్లే మార్గాల్లో రద్దీ ఊహించని స్థాయిలో పెరిగిపోతుంది.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రతి ఏటా ప్రత్యేక సర్వీసులను ప్రవేశపెడుతూనే ఉన్నప్పటికీ, ఈసారి నెలన్నర ముందుగానే అడ్వాన్స్ బుకింగ్, రైళ్ల వివరాలను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎంఎంటీ- సావంత్‌వాడి రోడ్, సీఎస్ఎంటీ- రత్నగిరి, లోకమాన్య తిలక్- సావంత్‌వాడి రోడ్, లోకమాన్య తిలక్- మడ్‌గావ్, పుణే- రత్నగిరి, దివా- ఖేడ్ మెము, దివా- చిప్లున్ మెము వంటి రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.
గణేష్ చతుర్థి వేడుకలకు సొంతూళ్లకు వెళ్లే లక్షలాది మందికి ఈ రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి. ప్రయాణికులు ఎన్టీఈఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా రైళ్ల ప్రయాణ సమయం, హాల్టింగ్ పాయింట్లను తెలుసుకోవచ్చు. ముంబై, పూణే ప్రాంతాల్లో నివసించే భక్తులు వీలైనంత త్వరగా టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా సెంట్రల్ రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications