వాన కోసం...వింత ఆచారం:పాయసం కొండ మీద ముద్దలుగా పెట్టి నాకుతారు
విజయనగరం:వర్షాలు పుష్కలంగా కురవాలని, వరుణ దేవుడు కరుణించాలని యజ్ఞాలు, యాగాలు చేయడం...కొన్ని చోట్ల కప్పలకు పెళ్లిళ్లు చేయడం, గ్రామదేవతకు బిందెలతో నీటిని తెచ్చి అభిషేకం చేసి చల్లబర్చడం ఇలా రకరకాల ఆచారాలు చూస్తుంటాం.
కానీ ఇవి కాకుండా మరికొన్ని చోట్ల వింత ఆచారాలు కూడా అమలులో ఉన్నాయి. అలాంటి విచిత్ర ఆచరంలో ఒకటి విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేటలో కూడా కనిపిస్తోంది. ఈ ఆచారం ప్రకారం వానదేవుడి కరుణ కోసం గ్రామస్తులు పాయసం నాకాలి. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా?... అయితే ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాల్సిందే....

వరుణ దేవుడు కరుణించి కోరుకున్నట్లుగా వానలు పడేందుకు కూర్మరాజుపేట గ్రామస్థులు ఏం చేస్తారంటే...తమ గ్రామానికి దగ్గరలోని పునికినివలస ఊరి వద్దనున్న రాతికొండపై ముందుగా జాకరమ్మ తల్లికి సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత అక్కడే మట్టి కుండల్లో పాయసం వండుతారు. ఆ పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత ఓ కోడి, మేకతో ఆ ప్రసాదాన్ని ఆరగింపజేస్తారు.
తదనంతరం ఆ పాయసాన్ని అదే రాతి కొండపై చిన్నచిన్న ముద్దలుగా పేర్చుతూ పోతారు. ఆ తరువాత గ్రామస్థులు అందరూ పంక్తిగా చేరి ఆ పాయసాన్ని నాకుతారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని అక్కడి వారి నమ్మకం. ఈ ఆచారం ఎన్నో ఏళ్లుగా వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆదివారం ఈ కార్యక్రమాన్ని స్థానికులు భక్తిశ్రధ్దలతో సంప్రదాయబద్దంగా ఘనంగానిర్వహించారు. ఇక వానలు కురవడమే తరువాయి అని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications