vizianagaram assembly round up: విజయనగరంలో విజయం వరించేది ఎవరిని?
విజయనగరం జిల్లాలోని విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉంటే, అన్ని నియోజకవర్గాలలో విజయనగరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరగగా అత్యధిక సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.
ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఎక్కువసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఈ నియోజకవర్గానికి తొలి ఎన్నిక 1952లో జరిగింది. విజయనగరం అసెంబ్లీ స్థానం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచింది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఏడుసార్లు అశోక గజపతిరాజు విజయం సాధించి నియోజకవర్గం పై పట్టు దక్కించుకున్నారు.

2019ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు పై వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన కోలగట్ల వీరభద్ర 6 వేల పైచిలుకు ఓట్లు తేడాతో విజయకేతనం ఎగురవేశారు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాలలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. విజయనగరం నియోజకవర్గం నుంచి మళ్లీ పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజుకు అవకాశం కల్పించింది.
ఆమెపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తూ, ప్రజాక్షేత్రంలోకి వెళుతుంది. పూసపాటి అదితి గజపతిరాజును గెలిపించడం కోసం, అశోక్ గజపతిరాజు ఇప్పటి నుండే వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.
ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎన్నికల బరిలోకి దిగుతున్న కోలగట్ల వీరభద్రస్వామి సంక్షేమ మంత్రాన్ని నమ్ముకొని ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. జగన్ అందించిన సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేస్తూ, అభివృద్ధి, సంక్షేమం కావాలంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మళ్లీ పట్టం కట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా రాజుల ఆధిపత్యం చెలాయించే విజయనగరం నియోజకవర్గంలో ఈసారి విజయం ఎవరిని వరిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications