ఎన్నికల ప్రచారంలో వైసీపీ కోసం వాలంటీర్లు, ఉద్యోగులు .. ఆధారాలతో సహా ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలలో అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఒకరిని మించి ఒకరు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అయినా ఉనికి చాటుకోవాలని ప్రతిపక్షాలు తాపత్రయపడుతుంటే, ఈ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసి ప్రతిపక్షాల ఉనికిని ప్రశ్నార్ధకం చెయ్యాలని అధికార వైసీపీ భావిస్తుంది. ఇక గతంలో ఎన్నికలలాగానే ఈ ఎన్నికల్లో కూడా అధికార వైసిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్న వైసీపీ .. టీడీపీ ఆరోపణ
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, కావాలని టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని, పోలీసులను వైసీపీ నేతలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని, తమకు అనుకూలంగా ఉన్న అధికారులను ఎన్నికలు జరుగుతున్న చోట పార్టీ పనుల కోసం వాడుకుంటున్నారని రకరకాల ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి సారించాలని, చర్యలు తీసుకోవాలని టిడిపి డిమాండ్ చేస్తుంది.ముఖ్యంగా విలేజ్ వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని ఆరోపిస్తుంది.

అధికారం అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ యత్నం
టిడిపి నేతలు అధికార పార్టీ వైసీపీపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిన అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన అనేక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ప్రస్తుతం అదే పనిలో ఉందని ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. వార్డు వాలంటీర్ ల ను దుర్వినియోగం చేస్తున్నారని, విలేజ్ వాలంటీర్ల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల కోడ్ ను అడుగడుగునా వైసీపీ ఉల్లంఘిస్తుందని ఫిర్యాదు
కొండపల్లి, కుప్పం, నెల్లూరులలో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటున్నారు అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆధారాలు సమర్పించినట్టు తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా వాలంటీర్లు, అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాజంపేట కమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, కోడ్ కు విరుద్ధంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలుగుదేశం పార్టీ నేతలు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Recommended Video

ఉద్యోగులతో నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు .. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీల పరిధిలోని ఉద్యోగులతో ఉద్యోగ వ్యవహారాల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి సమావేశాలు నిర్వహించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని తెలుగుదేశం పార్టీ తమ ఫిర్యాదులో తెలియజేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన లకు పాల్పడుతున్న, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న వాలంటీర్లు ఉద్యోగులపై చట్టపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి, అశోక్ బాబు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో వైసిపి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications