చంద్రబాబు కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిల్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మరిన్ని చిక్కులు వచ్చిపడేలా ఉన్నాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని పిల్‌లో కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీ, చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా 44 మందిని ప్రతివాదులుగా చేర్చారు. రిట్ నెంబర్:-38371/2023 ప్రకారం హైకోర్టు రిజిస్ట్రార్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసు(skill development case)లో ఇప్పటికే అరెస్టయిన చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

ఇది ఇలావుండగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రాజధాని అమరావతికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు.. దాన్ని అనుసంధానించే రహదారుల అలైన్మెంట్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. అదే ఏడాది మే 29న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది.
చంద్రబాబును మొదటి నిందితుడిగా సీఐడీ పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేశారు. కేసులోని ఇతర నిందితులకు బెయిల్ వచ్చిందని చంద్రబాబు తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ సెప్టెంబర్ 26కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications