ఏపీ వేరే రాష్ట్రం- నాకు అక్కడ ఓటు హక్కు కూడా లేదు: మెగాస్టార్ సంచలనం
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ.. వాల్తేర్ వీరయ్య. శృతిహాసన్ హీరోయిన్. రవితేజ ప్రత్యేక పాత్రను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమాకు దర్శకుడు.. కేఎస్ రవీంద్ర. సుమారుు 140 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది మూవీ. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన విడుదల కానుందీ మూవీ. శనివారమే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకొంది.

ఆచార్య తరువాత..
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య తరువాత చిరంజీవి నటించిన మూవీ ఇదే. ఆచార్య చిరంజీవి కేరీర్‌లోనే ఓ డిజాస్టర్ గా మిగిలి పోయిన విషయం తెలిసిందే. పైగా ఇది చిరంజీవి హోమ్ ప్రొడక్షన్ కూడా. కోట్లాదిమంది చిరంజీవి అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసిందీ సినిమా. రామ్ చరణ్ తో కలిసి నటించినా గానీ ప్రేక్షకులు ఈ సినిమాను ఏ మాత్రం ఆదరించలేదు. ఆయనకు భారీ నష్టాన్ని మిగిల్చిందీ మూవీ.

మాస్ క్యారెక్టర్‌లో..
ఆచార్య తరువాత వస్తోన్న మూవీ కావడం, చిరంజీవి గల్ల లుంగీ, పూలచొక్కాతో పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తోండటంతో వాల్తేర్ వీరయ్యపై హైప్ క్రియేట్ అయింది. దీనికి అనుగుణంగా ట్రైలర్ టాక్ కూడా అదరగొట్టింది. మాస్ మహారాజా రవితేజ కూడా తెరను పంచుకోవడం సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి.

ప్రమోషన్స్ లో
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు చిరంజీవి. విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సన్నద్ధమౌతోన్నారు. సంక్రాంతి పండగ కూడా వస్తోండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మెగాస్టార్ మరింత ముమ్మరం చేశారు. ఎంపిక చేసిన న్యూస్ ఛానల్స్‌కు చిరంజీవి వరుసగా ఇంటర్వ్యూలను ఇస్తోన్నారు.

కీలక వ్యాఖ్యలతో..
ఈ ఇంటర్వ్యూల్లో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు రాజకీయాల్లో కొనసాగిన అనుభవం ఉంది చిరంజీవికి. ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని నెలకొల్పడం- మరో తమ్ముడు నాగబాబు అదే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో- రాజకీయాల ప్రస్తావన అనివార్యంగా వస్తోంది ఈ ఇంటర్వ్యూల్లో. వాటిపై మాట్లాడటానికి చిరంజీవి సంకోచించట్లేదు. ముక్కుసూటిగా సమాధానాలను ఇస్తోన్నారు.

ఏపీ రాజకీయాలతో సంబంధం లేదు..
ఏపీ రాజకీయాలతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని చిరంజీవి తేల్చి చెప్పారు. అది వేరే రాష్ట్రమనీ స్పష్టం చేశారు. తనకు అక్కడ కనీసం ఓటు హక్కు కూడా లేదని వ్యాఖ్యానించారు. తాను ఏపీ పక్క రాష్ట్ర పౌరుడినని పేర్కొన్నారు. తనకు ఓటు హక్కు ఉన్న రాష్ట్రం మీది నుంచే తాను మాట్లాడుతున్నానని వివరించారు.

అక్కడేం జరుగుతున్నాయో తెలియదు..
ఏపీలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో అనేది కూడా తెలియదని చిరంజీవి సూటిగా చెప్పారు. పేపర్ ద్వారా ఇతరులు ఏపీ రాజకీయాల గురించి ఏం పరిశీలిస్తారో.. తాను అంత కంటే తక్కువే పరిశీలిస్తానని అన్నారు. తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉందని కుండబద్దలు కొట్టారాయన. కరోనా వైరస్ సమయం నుంచీ తన ఇంటికి పేపర్లు కూడా రావడం మానేశాయనీ చెప్పుకొచ్చారు. అక్కడేం జరుగుతోందో వినటం లేదని, తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదని అన్నారు.

2024లో..
తాను 2024 ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వట్లేదని మరో ఇంటర్వ్యూలో మెగాస్టార్ స్పష్టం చేశారు. తన సినిమాలు తాను చేసుకుంటూ పోతానని పేర్కొన్నారు. సినిమాలపరంగా తనను ఎప్పుడూ బిజీగా ఉంచాలనే సందేశాన్ని మాత్రమే తాను అభిమానులకు ఇస్తోన్నానని, అంతకు మించి ఇంకేమీ ఉండబోదని పేర్కొన్నారు. తన దృష్టిం మొత్తం సినిమాల మీదే ఉందని, ఇక ముందు కూడా ఉంటుందనీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications