వరంగల్ లోకసభ సీటు: రాజయ్యపై కడియానికి కష్టమే?
వరంగల్: అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణలోని వరంగల్ లోకసభ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొని ఉంది. సిట్టింగ్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కడింయ శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థిగా రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరిన కడియం శ్రీహరి విజయం కోసం హోరాహోరీ పోరాడక తప్పదని అంటున్నారు.
వరంగల్ లోక్‌సభ స్థానానికి ఓ చారిత్రక నేపథ్యం ఉంది. మాజీ ప్రధాని పివి నర్సింహారావు లాంటి ఉద్దండులను పార్లమెంటుకు అందించడమే కాకుండా వారిని ఓడించిన చరిత్రను ఈ నియోజకవర్గానికి ఉంది. దేశంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన దివంగత మాజీ ప్రధాని పివి నర్సింహారావును రెండు సార్లు లోక్‌సభకు పంపించింది. ఓసారి ఆయనను ఓడించిన నేపథ్యం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన జంగారెడ్డి పివిపై విజయం సాధించారు.

కేంద్రమంత్రిగా బాధ్యతలను నిర్వహిం చిన రాజకీయ కురువృద్దుడు కమాలుద్దీన్ అహ్మద్‌ను వరుసగా మూడు సార్లు లోక్‌సభకు పంపి హ్యాట్రిక్ సాధించింది. వరంగల్ లోక్‌సభ పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట(ఎస్సీ), స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ), పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 14,95,611 మంది ఉండగా, పురుషులు 7,50,743, మహిళలు 7,44,727 మంది ఉన్నారు.
వరంగల్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపి సిరిసిల్ల రాజయ్య, తెరాస అభ్యర్థి కడియం శ్రీహరిలపై టిడిపి బలపర్చిన బిజేపి అభ్యర్థి రామగళ్ల పరమేశ్వర్ ఎన్నికల బరిలో నిలిచారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి కొండా సురేఖ సహకారం ఉంటే కడియం శ్రీహరి గట్టెక్కే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications