తెలంగాణాపై కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ ఫిర్యాదు... తారాస్థాయికి చేరిన తెలుగురాష్ట్రాల జలజగడం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణా జలాల వాడకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కు తెర పడటంలేదు. ఒకరిమీద ఒకరు వరుసగా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. నదీ జలాల వాటాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం తెలుగు చిలికి గాలివానగా మారి కేంద్రం జోక్యం చేసుకునే దాకా వెళ్లింది.

కృష్ణా బోర్డుకు తెలంగాణాపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు
ఇక తాజాగా కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్రం పై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. విద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జున సాగర్ జలాలను తెలంగాణ ప్రభుత్వం వినియోగిస్తోంది అని ఈ లేఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి నారాయణ రెడ్డి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు.

నాగార్జున సాగర్ నుండి తెలంగాణా విద్యుత్ ఉత్పత్తిపై ఫిర్యాదు
గతేడాది వర్షాకాలం ప్రారంభం కాకముందే తెలంగాణ రాష్ట్రం నాగార్జున సాగర్ నుంచి నీటిని తరచూ విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించిందని, దీనివల్ల పులిచింతల ప్రాజెక్టు లో స్పిల్ వే రేడియల్ గేట్లను తెరవడం, మూయడం చేయాల్సి వచ్చిందని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా స్పిల్ వే గేట్ నెంబర్ 16 కొట్టుకు పోయిందని ఆయన పేర్కొన్నారు. ఆ గేటు ఇప్పటికీ అమర్చలేదని, దాని రిపేర్ పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేసిన ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ఇబ్బంది తలెత్తుతుందని వెల్లడించారు.

విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వృధా చేస్తున్న తెలంగాణా సర్కార్
విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్రం నీటిని విడుదల చేస్తూ పోతే ఈ నీరు వృధాగా సముద్రంలోకి పోతుందని పేర్కొన్నారు. ఇక వేసవిలో తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలూ నాగార్జునసాగర్ పైన ఆధారపడి ఉన్నాయని, విద్యుత్ ఉత్పత్తి కోసం విలువైన నీటిని వృధా చేస్తే వేసవిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. దీనిని కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డ్ పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రజల త్రాగునీటి అవసరాలను పరిగణన లోకి తీసుకోవాలి
విద్యుత్ ఉత్పత్తి వల్ల వస్తున్న నీటిని పులిచింతల గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజ్ లోకి, ఇక ప్రకాశం బ్యారేజ్ కూడా నిండుగా ఉండటం వల్ల, అక్కడ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదలవలసి వస్తుందని పేర్కొన్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని నాగార్జునసాగర్ లో కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వృధా చేయకుండా తెలంగాణ సర్కార్ ను కట్టడి చేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేసింది.

ఢిల్లీ పర్యటనలో జగన్.. కేంద్రమంత్రితో నదీజలాలపై చర్చించే అవకాశం
ఇప్పటికే అనేక మార్లు ఏపీపై తెలంగాణా, తెలంగాణా నదీజలాల వినియోగంపై ఏపీ ఫిర్యాదులు చేశాయి. ఇదిలా ఉంటే ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ కానున్నారు. ఇక కేంద్ర మంత్రి తో భేటీ నేపథ్యంలో నదీ జలాల విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications