బిజెపితోనే: తెలంగాణ బిల్లుపై దాటేసిన చంద్రబాబు
న్యూఢిల్లీ: పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారా అన్న విషయంపై స్పందించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిరాకరించారు. సోమవారం ఢిల్లీలో ఆయనను ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఆయన సోమవారం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు.
అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని అన్నారు. తాము కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వానికి మద్దతిస్తామని చంద్రబాబు తెలిపారు. గతంలో కూడా తాము ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న విభజన ప్రక్రియ సరైన విధంగా లేదని, రెండు ప్రాంతాల నాయకులను కూర్చోబెట్టి సరైన పరిష్కారం చేయాలని అన్నారు.

రాష్ట్రపతి, జాతీయ పార్టీల నేతలకు కాంగ్రెస్ చేస్తున్న కుట్ర రాజకీయాలను వివరిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. విభజన ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుజాతిని విచ్ఛిన్నం, నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
లోపాలు, తప్పులతడకలతో కూడిన బిల్లును రాష్ట్ర శాసనసభకు పంపారని, రెండు ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా లేదని చంద్రబాబు అన్నారు. తాము విభజనపై స్పష్టంగా ఉన్నామని తెలిపారు. అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేసేలా చూడాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు ఈ సందర్బంగా చంద్రబాబు తెలిపారు.
దేశంలో ఇప్పటి వరకు ఎస్సార్సీ, ప్రత్యేక కమిటీ ద్వారా రాష్ట్రాలను ఏర్పాటు చేశారని, ప్రస్తుత ఏకపక్ష నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ విభజన అని విమర్శించారు. టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలతో రాజీపడే విభజనకు పూనుకుందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సమన్యాయం కోసం తాను ఢిల్లీలో నిరాహార దీక్ష చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నాయని విభజనపై ఈ విధంగా ముందుకెళ్లడం సమంజసం కాదని అన్నారు.












Click it and Unblock the Notifications