పవన్‌పై ఎలాంటి కోపం లేదు.. జాలి తప్ప: సజ్జల
Sajjala Ramakrishna Reddy: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు.
దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బస్సు యాత్ర పనుల్లో తీరిక లేకుండా గడుపుతోంది వైఎస్ఆర్సీపీ. గడువు సమీపిస్తోండటంతో కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించి దలిచిన బహిరంగ సభ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోంది.

ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పారు. రెండోసారి గెలవడానికి గల కారణాలనూ ఆయన విశ్లేషించారు.
ఈ ఇంటర్వ్యూలో జనసేన అధినేత, పిఠాపురం కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్ అంశం ప్రస్తావనకు వచ్చింది. పవన్ కల్యాణ్‌పై తమకు ఎలాంటి కోపం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ఆయనపై జాలి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. పవన్ అంటే జగన్ జాలి పడతామని పేర్కొన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఎదగడానికి పవన్ కల్యాణ్‌కు ఎంతో అవకాశం ఉందని సజ్జల పేర్కొన్నారు. ఆయన అభిమానులే ఆయనకు పునాది అని, దాన్ని వాడుకుని ప్రజలకు సేవ చేయొచ్చని చెప్పారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా.. ఈ 10 సంవత్సరాల్లో పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారని అన్నారు. గెస్ట్ గానో, కాల్షీట్స్ తీసుకుని పని చేసే ఆర్టిస్ట్ గానో వ్యవహరిస్తోన్నారని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు కోసం కొవ్వొత్తిలాగా తన జీవితాన్ని కరిగించుకుంటోన్నాడని చెప్పారు.
గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం లేదంటూ ఇటీవలే పవన్ చేసిన వ్యాఖ్యలను సజ్జల ప్రస్తావించారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా సరే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జీ, క్షేత్రస్థాయిలో నిర్మాణం జరుపుకొంటారని, అలా పెట్టుకోవడానికి ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. పదేళ్లయినా కూడా అలాంటి నిర్మాణం పవన్ పార్టీలో కనిపించదని అన్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరుపుకొంటే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అవుతుందని పవన్ భావించి ఉండొచ్చని సజ్జల అన్నారు. ఒక వర్గానికి చెందిన ప్రజలను పవన్ కల్యాణ్ మోసం చేస్తోన్నారని, పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడని చెప్పారు. జగన్‌ను అధికారం నుంచి దించడమే లక్ష్యమని చెప్పుకొంటోన్నాడని, పోనీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడా అంటే అదీ లేదని ఎద్దేవా చేశారు.
తాను పార్టీ పెట్టింది ప్రశ్నించడం కోసమేనని, అధికారం కోసం కాదని చెప్పే పవన్ కల్యాణ్ 2019లో ఏ టీడీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశాడో.. అదే టీడీపీతో ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడని సజ్జల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్.. తమ నాయకుడి గురించి, పార్టీ గురించి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు సాధారణంగానే తమ నుంచి రియాక్షన్లు ఉంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications