బీజేపీని వదులుకోలేం- టీడీపీని కాదనలేం..!!
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. టీడీపీకి అండగా నిలవాలని జనసేన నిర్ణయించుకుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటూ స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఆయన చేసిన ఈ ప్రకటన కాస్తా జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులకు కొరుకుడు పడట్లేదు. తాము పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంటే.. ఆయన చంద్రబాబును సీఎం స్థానంలో కూర్చోబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోన్నారనే అభిప్రాయాలు బహిరంగంగా వ్యక్తమౌతోన్నాయి.

అదే సమయంలో- వారాహి విజయయాత్ర సందర్భంగా కృష్ణాజిల్లా పెడనలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనలు కలకలం రేపిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి తాము బయటకు వస్తోన్నామని, టీడీపీతో కలిసి పనిచేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆయన తేల్చి చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రస్తుతం బీజేపీతో ఉన్న పొత్తును జనసేన తెగదెంపులు చేసుకుందంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఎన్డీఏకూ పవన్ కల్యాణ్ గుడ్‌బై చెప్పారనే ప్రచారం జోరుగా సాగింది. పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేస్తారని, ఇకపై బీజేపీని కూడా పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి.
దీనిపై తాజాగా జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. పెడన సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని స్పష్టం చేశారు. ఎన్డీఏలో తాము ఇప్పటికీ భాగస్వామ్యులమేనని పేర్కొన్నారు. ఎన్డీఏలో కొనసాగుతామని తేల్చి చెప్పారు. ఎన్డీఏలో భాగస్వామిగానే తాను తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నానని పవన్ కల్యాణ్ చెప్పారని బొలిశెట్టి వివరించారు.

ఏపీ నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టడానికి తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారని బొలిశెట్టి చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ బలహీన పడిందని, అందుకే ఆ పార్టీకి అండగా నిలవాలని పవన్ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
తాను ఎన్డీఎ నుంచి బయటికి వచ్చినట్లు పవన్ కల్యాణ్ ఎక్కడా చెప్పలేదని, అలాంటి ప్రకటన ఎప్పుడూ చేయలేదని బొలిశెట్టి అన్నారు. తాము ఎన్డీఎతోనే ఉన్నామని, అందులో కొనసాగుతూనే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని, ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications
