మీకు నీటిని కట్ చేస్తాం: చంద్రబాబుకు హరీష్ హెచ్చరిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏల రద్దు నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. మంత్రి హరీష్ రావు శనివారం మాట్లాడుతూ... తమకు విద్యుత్ ఇబ్బందులు సృష్టిస్తే హైదరాబాదులో ఉంటున్న ఎపి మంత్రులకు తాము విద్యుత్, నీటిని రాకుండా చేస్తామని హెచ్చరించారు. విభజన సమయంలో చేసిన చట్టాలను ఉల్లంఘించవద్దన్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పీపీఏ ప్రతిపాదనల ఉపసంహరణ నిర్ణయం పెద్ద కుట్ర అని, దీన్ని విరమించుకోకపోతే నగరంలోని ఆంధాఆఫీసులకు, అధికారుల నివాసాలకు కరెంటు కట్ చేస్తామని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ హెచ్చరించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు 20 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు 15 వేల కోట్ల రూపాయలు చెల్లించారన్నారు. 2009 నుంచి పీపీఏలు లేనప్పుడు తెలంగాణ ప్రజల నుంచి బిల్లులు ఎలా వసూలు చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కొరత ఏర్పడేందుకు కుట్రలు పన్నితే హైదరాబాద్‌లో ఏపీ ఆఫీసులకు కరెంటు కోతలు తప్పవన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి 5300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరమయితే అందులో 2300 మెగా వాట్లు హైదరాబాద్‌కే కావాలన్నారు. సుమారు రూ.3 వేల కోట్లు ఫిక్స్‌డ్ చార్జీలుగా తెలంగాణ ప్రజలు చెల్లిస్తున్నారని, అదే డబ్బును నేరుగా తెలంగాణ జెన్‌కోకు అందిస్తే 1500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌పవర్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.
సోలార్ పద్ధతిలో ఒక్క మెగావాట్‌కు రూ.7-8 కోట్లు ఖర్చయితే, దాంట్లో కేంద్రం 50%, రాష్ట్ర ప్రభుత్వం 20%, రైతులు 30% పెట్టుబడి పెడితే ఉదయం వేళల్లో 9 గంటల పాటు కరెంటు సరఫరా చేసే అవకాశాలున్నాయన్నారు. కరెంటు కోతలను నివారించడానికి సోలార్ పవర్ యూనిట్ ధర 6.49 పైసల నుంచి సవరించి హేతుబద్దమైన ధర చెల్లించాలని, దీంతో పెట్టుబడిదారులు ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్న ఏపీ జెన్‌కో నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. పీపీఏ రద్దు చేసుకోవాలనుకుంటున్న ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంత పెట్టుబడి రూ.15000 కోట్లు ఉన్నాయని తెలిపింది. ఆ ప్రాజెక్టుల స్థిర చార్జీల భారం తక్కువున్నందుకే వాటిని కబళించేందుకు చంద్రబాబు కుట్రపన్నారని ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాము ఎంతదూరమైనా పోరాడుతామని శివాజీ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications