టి బిల్లుకు రాజ్యసభ ఆమోదిస్తే మెడమీద కత్తే: ఉండవల్లి

కాంగ్రెస్ అధిష్టానం ఊహించని విధంగా రాష్ట్ర అసెంబ్లీ విభజన బిల్లును తిరస్కరించి పంపించిందని చెప్పారు. బిల్లును రాజ్యసభలో పెడతామనే ఆలోచనే లోక్‌సభలో ఆ బిల్లును పెట్టలేదనే విషయాన్ని చెబుతోందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్రపతి ఆమోదించిన బిల్లును ఇవాళకాకపోతే రేపైనా పార్లమెంటుకు పంపిస్తారని చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా రాజకీయ నాయకుడేనని అన్నారు. బిల్లుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు ఉండవల్లి చెప్పారు.
ఏ పార్టీ మద్దతు లేకుండా రాజ్యసభలో బిల్లును ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు. 271 డి అమలులో ఉండగా రాష్ట్ర విభజన ఎలా చేస్తారని అన్నారు. గవర్నర్‌కు లాండ్ ఆర్డర్‌ను అప్పగించాలనుకోవడం అసంబద్ధ నిర్ణయమని ఉండవల్లి తెలిపారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరమని చెప్పారు. బిల్లు విషయం సుప్రీం కోర్టుకు వెళుతుందని అన్నారు. కేంద్రం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగలదా లేదా అన్నది చూడాలని ఆయన అన్నారు.
ఎంపి కెవిపి రాంచంద్రరావు రాజ్యసభ వెల్‌లోకి ఆందోళన చేపడుతున్నారని, సమైక్యం విషయంలో తాను వెనక్కి వెళ్లబోనని కెవిపి చెప్పినట్లు ఉండవల్లి తెలిపారు. లోక్‌సభకు బిల్లు వచ్చినట్లయితే సీమాంధ్రకు చెందిన అన్ని పార్టీల నాయకులం ఒక్కటై అడ్డుకుంటామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో సభను జరగనివ్వమని ఉండవల్లి చెప్పారు. బిల్లు చట్టమయ్య పరిస్థితి వస్తే సుప్రీం కోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ విధంగా పలుమార్లు జరిగినట్లు ఆయన వివరించారు.
తాము ఎలాగైనా బిల్లు ఆమోదం పొందకుండా ఎన్నికల వరకు ఆపగలమని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలకు ఇంకా 8 పని దినాలు మాత్రమే ఉన్నాయని, ఆరోజుల్లో బిల్లును అడ్డుకుంటే ఎన్నికలయ్యే వరకు విభజన ఆగినట్లేనని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఎంపి సబ్బం హరి ఆత్మహత్య చేసుకుంటాననడం కలకలం రేపిందని అన్నారు. పార్లమెంటు మార్షల్స్ తాము ఏం చేస్తామనేదానిపై ఆరా తీస్తున్నారని తెలిపారు.
సీమాంధ్ర కేంద్రమంత్రులు కూడా పార్లమెంటులో తమకు మద్దతుగా నిల్చుంటున్నారని చెప్పారు.
ఇది ఆఖరి పోరాటం కాదని, ఇంకా పోరాటాలు చాలా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పారు. జర్నలిస్టుల సమావేశంలో ఉండవల్లితోపాటు ఎంపి కెవిపి రాంచంద్రరావు, కొనకళ్ల నారాయణ, ఏపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు, సమైక్యవాదులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications