చంద్రబాబుపై రోజా, మోడీపై జగన్: విజయమ్మ కంటతడి
కడప: తెలుగుదేశం పార్టీ పెద్ద మెజార్టీతో ఏమీ గెలిచి అధికారంలోకి రాలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం అన్నారు. ఇడుపులపాయలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. జగన్‌ను తమ నేతగా శాసన సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు.
ఇద్దరు ఎంపీలతో వైయస్ జగన్ ప్రజల కోసం పోరాటం చేశారని రోజా అన్నారు. తాము నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా చంద్రబాబు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని చెప్పారు. నాలుగేళ్లుగా ప్రజల కోసం జగన్ కష్టపడితే... చివరి నిమిషంలో మోడీతో జతకట్టి, రైతు రుణమాఫీ అని అమలు కానీ హామీ ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, వారు కేవలం ఐదు లక్షల ఓట్లతోనే అధికారంలోకి వచ్చారన్నారు.
తాము ఎవరిని ఆకర్షించమని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. కొద్ది నెలల తర్వాత బాబుకు ఓటేసిన 1.9 పర్సెంట్ ప్రజలు తాము తప్పు చేశామని అర్థం చేసుకుంటారన్నారు. కుట్రలు, కుతంత్రాలు తమ పార్టీని ఓడించాయని ఉప్పులేటి కల్పన అన్నారు.

మోడీతో భేటీపై జగన్
కాబోయే ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ పైన వైయస్ జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన దృష్ట్యా రాష్ట్ర సమస్యల విషయమై మోడీని కలిశానని, దానిని కూడా రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నరేంద్ర మోడీతో భేటీ అయి బిల్లులో చేర్చాల్సిన అంశాలపై మాట్లాడానని తెలిపారు. ప్రజా సమస్యలపై కలిస్తే రాజకీయం చేయడమేమిటిని, ఇలాంటివి ఇక ముందు కూడా ఇలాంటివి కొనసాగుతాయని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి బాగు జరగాలన్నారు. కాగా అంతకుముందు వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కంటతడి పెట్టారు.












Click it and Unblock the Notifications