బలపడనున్న అల్పపీడనం, ఆ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. ఒకవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కనిపిస్తుండగా, మరోవైపు రాత్రి వేళల్లో చలి, ఉదయం పూట దట్టమైన పొగమంచు జనజీవనాన్ని ప్రభావితం చేస్తోంది. దీనికి సంబంధించి వాతావరణ కేంద్రం తాజా నివేదికను విడుదల చేసింది.
తూర్పు భూమధ్య రేఖా హిందూ మహాసముద్రం, దక్షిణ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఫిబ్రవరి 16 ఉదయం 8.30 గంటలకు అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వ్యవస్థ సముద్ర మట్టానికి సుమారు 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉండగా, ఫిబ్రవరి 18 నాటికి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంపై మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే రాష్ట్రంలో తక్షణ ప్రభావం మాత్రం పరిమితంగానే ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వచ్చే మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో ప్రధానంగా పొడి వాతావరణమే కొనసాగనుంది. ఈరోజు, రేపు కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. ఎల్లుండి కూడా వర్ష సూచనలు కనిపించడం లేదు.
రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. అయితే అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశముందని స్పష్టం చేశారు. కోస్తాంధ్రలో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండదని తెలిపారు.
Weather Update: ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
నిన్న రాష్ట్రంలో అత్యధికంగా నందిగామలో 35.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో దట్టమైన మంచు ప్రభావం స్పష్టంగా కనిపించింది. రహదారులపై విజిబిలిటీ తగ్గే అవకాశం ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు.
మొత్తానికి, అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై నేరుగా లేకపోయినా.. పొగమంచు, చల్లని వాతావరణం ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.












Click it and Unblock the Notifications