Fit India Movement: సైకిల్ తొక్కిన కలెక్టర్ నాగరాణి..!
దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా పశ్చిమగోదారి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇవాళ ఉదయం భీమవరంలోని విష్ణు కళాశాలలో "ఫిట్ ఇండియా - సైక్లోథాన్"ను ప్రారంభించారు. విష్ణు కళాశాల నుండి జువ్వలపాలెంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ఐదు కిలోమీటర్ల దూరం సాగిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నాగరాణి ముందుగా సైకిల్ తొక్కగా.. ఎస్పీ, మిగిలిన అధికారులు ఆమెను అనుసరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, శారీరక దృఢత్వాన్ని ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం చేసుకోవాలని అన్నారు. పూర్తి శారీరక , మానసిక శ్రేయస్సు కోసం ప్రతి వ్యక్తి నడక, సైక్లింగ్ లేదా యోగాకు సమయం కేటాయించాలన్నారు. అధికారిక విధుల ఒత్తిడితో కూడిన స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లా అధికారులు, సిబ్బంది కోసం నెలకు ఒకసారి నడకలు, 2కే రన్ లు , యోగా, సైక్లింగ్ వంటి ఫిట్‌నెస్-ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి నెలా ఫిట్‌నెస్ ఈవెంట్‌లను నిర్వహించడానికి పోలీసు శాఖ తీసుకున్న చొరవను కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ వీటిలో చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహించారు. ఈ కార్యకలాపాలు ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా ప్రోత్సహిస్తాయని తెలిపారు. మరోవైపు ఈ సైక్లింగ్ మారథాన్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి.. కలెక్టర్ నాగరాణి మార్గదర్శకత్వంలో ప్రతి నెలా ఒక ఫిట్‌నెస్ యాక్టివిటీ చేస్తామని తెలిపారు. ఇందులో నడక, సైక్లింగ్ లేదా యోగా ఉంటాయన్నారు.

ఇటువంటి కార్యక్రమాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, ప్రజలలో ఫిట్‌నెస్ గురించి అవగాహన పెంచుతాయని ఎస్పీ నయీమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, పాఠశాల విద్యార్థులు, సాధారణ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications