అనుకున్నదే జరిగింది.. మొత్తం చంద్రబాబుపై తోసేసిన సోము వీర్రాజు?
అసమ్మతి నేతలతో సమావేశం ముగిసిన తర్వాత మురళీధరన్ ఏపీకి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుంది. పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన సోము వీర్రాజు వైఖరి నచ్చక మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలాంటివారే తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంత మంది నాయకులు కూడా సోము తీరు నచ్చక సమావేశం పెట్టాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశాలు పార్టీ పరువుకు భంగం కలిగిస్తాయని, వెంటనే ఢిల్లీ రావాలని అధిష్టానం కబురు చేయడంతో అసమ్మతి నేతలంతా ఢిల్లీ వెళ్లారు.
ఏపీ వ్యవహారాలు చూస్తున్న మురళీధరన్ ను కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, సోము వీర్రాజు వైఖరిని పూర్తిగా వివరించారు. వీరితో సమావేశం ముగిసిన తర్వాత మురళీధరన్ ఏపీకి వచ్చారు. రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేశారు. సోము వీర్రాజు వైఖరిపై చాలామంది ఫిర్యాదులు చేశారు. అయితే ఈ సమావేశంలో సోముకు మద్దతుగా కూడా కొందరు నాయకులు వినతిపత్రాలు అందజేశారు. తాజాగా సోము వీర్రాజు రాష్ట్రంలో పరిస్థితికి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడే కారణమని తెలుపుతూ ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

రాష్ట్రంలో గతవారం చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితిని పూర్తిగా తెలియజేస్తూ ఆయన ఈ లేఖ రాశారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడివల్లే రాష్ట్రంలో పార్టీ ఎదగడంలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నానని, ఈ విషయంలో గతంలో కూడా మీకు లేఖ వివరాలు తెలియజేస్తూ నివేదికలు ఇచ్చానని, కానీ చంద్రబాబునాయుడు బీజేపీని బతకనివ్వడంలేదని, ఎక్కడికక్కడ కీలక నాయకులను పార్టీలోకి తీసుకుంటున్నారని, పదవులు ఆశ చూపుతున్నారని, ఇలా అయితే పార్టీ బతకడం కష్టం అని సోము తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పార్టీలోకి వెళ్లిపోయినవారు, వెళతారని భావిస్తున్నవారి పేర్లను కూడా సదరు లేఖలో సోము వీర్రాజు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. అధికార పార్టీ నుంచి ఏపీలో ఎటువంటి ఇబ్బంది లేదని, కేవలం చంద్రబాబు ఆయనకు చెందిన కొందరు వ్యక్తులద్వారానే పార్టీ ఇబ్బందుల్లో పడుతోందని ఆయన తెలిపినట్లు పార్టీ కీలక నాయకుడు ఒకరు తెలిపారు. తమ నాయకుడు కేంద్రానికి లేఖ రాశారని, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగోలేదని, ఎవరినీ ఏమీ అనే పరిస్థితి లేదని, నమ్మకంగా ఉంటూనే వెన్నుపోటు పొడుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications