చంద్రబాబు అధికారిక నివాసం: ఎవరీ లింగమనేని?
అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నుంచి సీఎం చంద్రబాబు తన పరిపాలనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసించేందుకు గాను కృష్ణానది కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
కృష్ణానదీ ముఖంగా లింగమనేని ఎస్టేట్ నిర్మించిన అందమైన ప్యాలెస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నివాస యోగ్యంగా మార్చేందుకు ప్రభుత్వం నిధులను వెచ్చించి భవంతికి మరిన్ని మెరుగులు పెట్టింది. అయితే అక్రమంగా నిర్మించిన ఈ ఇంటిలో చంద్రబాబు ఉండటం భావ్యం కాదంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.
నది తీరంలో ఎటువంటి అక్రమకట్టడాలను నిర్మించకూడదని ప్రభుత్వం, రాజ్యాంగం చెబుతుంటే లింగమనేని ఎస్టేట్ నిర్వాహకులు మాత్రం వాటిని ఉల్లంఘించి నిబంధనలకు వ్యతిరేకంగా కట్టడాన్ని నిర్మించారని ఆరోపణలు కూడా చేశారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో లింగమనేని రమేశ్ పేరు పెద్దఎత్తున మీడియాలో చర్చకు దారి తీసింది.

ఇంతకీ ఎవరీ లింగమనేని. విజయవాడ-గుంటూరుల మధ్య సుమారు మూడు వందల ఎకరాల భూమిని ఎలా సొంతం చేసుకున్నారో తదితర వివరాలను వెల్లడిస్తూ 'సాక్షి'లో ఓ కథనం ప్రచురితమైంది. అంతేకాదు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి భూ సమీకరణ చట్టం ఆయన సరిహద్దు గోడ వరకు వచ్చి ఆగిపోయింది.
దీనిని బట్టి లింగమనేని ఎంతటి పవర్‌పుల్ వ్యక్తో మీకు అర్ధమయ్యే ఉంటుంది. విషయానికి వస్తే లింగమనేని రమేశ్ ఎయిర్ కోస్టాకు చైర్మన్‌గా ఉన్నారు. 1983లో లింగమనేని ఎస్టేట్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు. ఈ సంస్ధ ఏపీలోని పలు నగరాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
ఈ సంస్ధకు ఛైర్మన్‌గా ఎల్. పూర్ణ భాస్కరరావు కొనసాగుతున్నారు. ప్రస్తుతం సీఐఐ విజయవాడగా ఉన్న లింగమనేని రమేశ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రాజధాని అమరావతిలో 'బాబు'ల బినామీ భూ బాగోతాలు అంటూ కథనాలను ప్రచురిస్తుంది.
ఇందులో భాగంగా ఈరోజు ఎవరీ లింగమనేని అనే కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు, లింగమనేని రమేష్‌కు మధ్య బంధం ఎంతో ధృడమైనదిగా అందులో పేర్కొంది. పేదల భూములను టీడీపీ నేతలు ఏవిధంగా కబ్జా చేస్తున్నారో అందులో వివరంగా వెల్లడించింది.

చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రోకోలో భాగంగా లింగమనేనికి ఏవిధంగా సహకరించిందో అందులో పేర్కొంది. మూడు పంటలు పండే పేదల భూములను బలవంతంగా సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం లింగమనేని వంటివారిని మాత్రం 'దయ'తో వదిలేసింది. నిడమర్రు సమీపంలోని లింగమనేని ఎస్టేట్‌ను రాజధాని భూ సమీకరణనుంచి తప్పించింది.
అందుకు ప్రతిఫలంగా లింగమనేని కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను నజరానాగా సమర్పించిందని పేర్కొంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో సుమారు 300 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి.
వీటిని 1937వ సంవత్సరంలో గుర్తించిన బాంబేకు చెందిన అసోసియేట్స్ సిమెంట్స్ కంపెనీ లిమిటెడ్ (ఏసీసీ) యాజమాన్యం ఈ భూములను రైతుల దగ్గర నుంచి 99 ఏళ్ళ లీజు విధానంలో సేకరించింది. అప్పట్లో ఏసీసీ సిమెంట్స్ ఎండీ డబ్ల్యూహెచ్ బెన్నిట్స్ తరఫున కూర్మరాజు గోపాలస్వామి రైతులందరి భూములు కేవలం విక్రయ కాంట్రాక్ట్ మాత్రమే తీసుకుంటున్నట్లు రైతులకు అగ్రిమెంట్ రాసిచ్చారు.
సిమెంట్ కంపెనీ యాజమాన్యం సున్నపురాయి నిక్షేపాలు తవ్వడం ఆపివేసిన పక్షంలో లీజు కాలం వరకూ ఈ భూముల్లో పంటలు వేసుకునేందుకు రైతులకు హక్కు కల్పించారు. లీజు గడువు ముగిసిన తరువాత ఆ భూములు వాటి యజమానులైన రైతుల స్వాధీనంలోకి వచ్చేలా విక్రయ కాంట్రాక్ట్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు.
అయితే అసలు మతలబు ఇక్కడే జరిగింది. లీజు గడువుకు ముందే ఏసీసీ లిమిటెడ్ ఈ భూముల్లో తవ్వకాలు నిలిపివేసి సిమెంట్ కంపెనీని తరలిపోయింది. అయితే చంద్రబాబు అధికారంలోకి రాగానే రైతులను మభ్యపెట్టి, మాయచేసి, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు.
అనంతరం ఆ స్టాంప్ పేపర్లలో తమకు నచ్చినట్లు రాసుకుని ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో రూ.1500 కోట్ల విలువ చేసే భూముల్ని తన వశం చేసుకున్నారు. రాజధాని ప్రాంతం ప్రకటనకు కొద్ది రోజుల ముందే లింగమనేని ఈ 300 ఎకరాల విలువైన భూములను ఓ ఎస్టేట్ మాదిరిగా మార్చారు.
భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులతో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎస్టేట్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఎకరం రూ. 5 కోట్ల వరకూ పలుకుతోంది. కాజ గ్రామానికి చెందిన కొంత మంది రైతుల వద్ద ఇంకా లీజు అగ్రిమెంట్‌లు ఉండటంతో లింగమనేని కబ్జా భాగోతం వెలుగులోకి వచ్చింది.
ఈ భూముల పక్కనే నారా లోకేశ్ కొట్టేసిన అగ్రిగోల్డ్ హాయ్‌ల్యాండ్ కూడా ఉండటం గమనార్హం. లీజుకు ఇచ్చిన తమ భూములు ఎక్కడు న్నాయో తెలుసుకునేందుకు కాజ గ్రామస్తులు ప్రయత్నించగా, లింగమనేని ఎస్టేట్‌లో ఉన్నట్లు తేలింది. లింగమనేని ఎస్టేట్స్ యాజమాన్యం అధీనంలో ఉన్న భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని, వాటికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధిత రైతులు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications