కుప్పం పై వైసీపీ జెండా - ధీమా వెనుక : చంద్రబాబు పట్టు సడలిందా - ఏం జరుగుతోంది..!!
ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికల పైన ఫోకస్ పెట్టారు. ప్రతీ అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 151 సీట్లు తగ్గకూడదని చెబుతూనే..175 సీట్లు ఎందుకు గెలవలేమని ప్రశ్నించారు. మొత్తం అన్ని సీట్లలో గెలుపు సాధ్యమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన పాలన పైన ప్రజలు పూర్తి పాజిటివ్ గా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం కట్టబెడతారనే నమ్మకంతో ఉన్నారు. కేడర్ లోనూ అదే ధీమా కలిగించి..వారిలో మరింత జోష్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, సీఎం జగన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కుప్పం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలోనూ కుప్పం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

కుప్పం తోనే మొదలు పెట్టిన సీఎం జగన్
చంద్రబాబుకు కంచుకోట అయిన కుప్పంలోనే వైసీపీ సత్తా చాటిందని...మిగిలిన ప్రాంతాల్లో ఎందుకు గెలవలేమని ప్రశ్నించారు. కుప్పంలో పంచాయితీ ఎన్నికల్లో... మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేమా అంటూ ధీమా వ్యక్తం చేసారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. పేదలకు అందించే పథకాలను అడ్డుకొనేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తున్నారు. కుప్పంలో పథకాలు ప్లస్ పోల్ మేనేజ్ మెంట్ కలిస్తే స్థానిక - మున్సిపల్ ఎన్నికల్లో విజయం దక్కిందనేది పార్టీ నేతల వాదన. అయితే, చంద్రబాబు సొంత నియోజవకర్గంలో అంత బలహీనపడ్డారా అనేది మరో చర్చ. చంద్రబాబు చివరి నిమిషం వరకూ ఓటమిని అంగీకరించటానికి సిద్దపడరు. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటిమిని మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోయారు.

పెద్దిరెడ్డికి ఆపరేషన్ కుప్పం బాధ్యతలు
ఆ ఎన్నికల తరువాత అక్కడ ప్రత్యేకంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన కుప్పం అభ్యర్ది చంద్రమౌళి కుమారుడు భరత్ కి ఎమ్మెల్సీ పదవి తో పార్టీ పదవి కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆయనే అభ్యర్ధి అంటూ పార్టీలో ప్రచారం సాగుతోంది. కానీ, బీసీ వర్గానికే సీటు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. కుప్పం నుంచి చంద్రబాబు ఇప్పటి వరకు ఏడు సార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మరో పార్టీ అక్కడ గెలవలేదు.
2019 ఎన్నికల్లో జగన్ మేనియా కనిపించిన సమయంలో కుప్పం ఫలితాల్లో రెండు రెండు రౌండ్లలో వైసీపీ ఆధిక్యత కనిపించింది. ఇక, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఒక్కరే టీడీపీ నుంచి గెలుపొందారు.

ధీమానా .. మైండ్ గేమ్ లో భాగమా
ఇప్పుడు ఆ జిల్లాలో ముగ్గురికి మంత్రులుగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్.. కుప్పం పైన కొత్త వ్యూహాలతో అక్కడ గెలుపు బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డి సైతం కుప్పం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ ఎప్పటికప్పుడు కేడర్ ను యాక్టివ్ చేస్తున్నారు. అయితే, పార్టీ అధినేతగా చంద్రబాబు తన నియోజకవర్గానికే పరిమితం కాలేని పరిస్థితి ఉంది. స్థానిక నేతల పైనా ఆయన కుప్పం బాధ్యతలు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాజీ మంత్రి..జిల్లా టీడీపీ నేతలకు కుప్పం లో మకాం వేసినా.. ఫలితాలు వైసీపీకి అనుకూలంగానే వచ్చాయి. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు .. అసెంబ్లీకి ప్రజల ఆలోచన..ఓటింగ్ లో తేడా ఉంటుందని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. కుప్పంలో వైసీపీ అధికార దుర్వినియోగంతో స్థానిక సంస్థల్లో గెలిచిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

హోరాహోరీ ఖాయంగా
అయితే, 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి తన సొంత నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ గా కూడా చేయలేకపోయారని..కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కుప్పంను రెవిన్యూ డివిజన్ గా చేయాలంటూ తన ప్రభుత్వానికి లేఖ రాసారని స్వయంగా జగన్ వెల్లడించారు. అదే విధంగా తాజాగా కుప్పంను రెవిన్యూ డివిజన్ గా అప్ గ్రేడ్ చేసారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ను ఓడిస్తే..ఇక, టీడీపీకి భవిష్యత్ లేదనేది వైసీపీ అంచనా. దీంతో.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మైండ్ గేమ్ ప్రారంభించింది. కానీ, టీడీపీ నుంచి ఆ స్థాయిలో రాజకీయంగా కౌంటర్ చేస్తున్నట్లుగా కనిపించటం లేదు. దీంతో...ఇప్పుడు కుప్పం నియోజకవర్గం పైన వైసీపీ నేతల ధీమా.. అక్కడ చోటు చేసుకొనే పరిణామాలు..చంద్రబాబు యాక్షన్ ప్లాన పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications