సార్.. నేను YCPలో చేరుతున్నానన్నారే? మళ్లీ 'రివర్స్'??
ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అడుగు పెట్టిన వెంటనే విజయాన్ని అందుకున్నారు. మారిన పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేతకు దగ్గరయ్యారు. పదవిని అనుభవించారు. గత ఎన్నికల సమయానికి 'సార్.. నేను వైసీపీలో చేరుతున్నానంటూ' చివరి నిముషంలో అధినేత నమ్మకాన్ని వమ్ము చేస్తూ వెళ్లిపోయారు.

మంత్రి పదవిని ఏవీ కాపాడలేకపోయాయి
వైసీపీలో చేరిన తర్వాత విజయం సాధించి మొదటి విడత మంత్రి పదవిని దక్కించుకున్నారు. రెండోవిడత మంత్రివర్గంలో స్థానం లేకుండా పోయింది. అందుకు ఆయన పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో చేసిన విమర్శలు కూడా ఆయన మంత్రి పదవిని కాపాడలేకపోయాయి. మరోవైపు జనసేన, పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శలద్వారా పవన్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఏమిటా? అనే ఆలోచనలో పడిపోయారు.

రాబోయే ఎన్నికల్లో సీటు కష్టమే
కొన్నాళ్లుగా సొంత పార్టీ అదిష్ఠానం మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై మాటల దాడిని ఆపేశారు. వచ్చే ఎన్నికల్లో సీటిస్తారో? లేదో? కూడా స్పష్టత లేదు. అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. జిల్లాకు చెందిన వైసీపీ నాయకులెవరినీ కలవడంలేదు. "భర్త కొట్టాడు అనే బాధ కంటే తోడికోడలు తొంగిచూసినందుకే బాధ ఎక్కువనే" వ్యవహారిక విషయాన్ని గుర్తుకు తెచ్చేలా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తర్వాత పార్టీలో చేరిన పంచకర్ల రమేష్ బాబుకు జిల్లా అధ్యక్ష పదవిచ్చారన్నదే ఆయనకు ఎక్కువ వేదనకు గురిచేస్తోంది. అవంతి శ్రీనివాస్ తోపాటు పంచకర్ల కూడా కాపు సామాజికవర్గానికి చెంది నేతే. అయితే వైసీపీ అధిష్టానం పంచకర్ల రమేష్ బాబును ప్రోత్సహిస్తోందని, తనను పక్కన పెట్టేస్తోందనే భావనలో అవంతి ఉన్నారు.

పార్టీలో కొనసాగడం అవసరమా?
ఇన్నిరకాలపరిణామాల మధ్య పార్టీలో కొనసాగడం అవసరమా? అని యోచిస్తున్నట్లు అవంతి అనుచరులు చెబుతున్నారు. టికెట్ దక్కకపోతే మాజీ మంత్రికే టికెట్ లేదన్న అపప్రథ మూటకట్టుకోవాల్సి వస్తుందని, దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? అనే యోచనలో పడిపోయారు. భీమిలీలో తనకు బలముంది. టీడీపీలో చేరితే భీమిలీ టికెట్ దక్కుతుందన్న నమ్మకం కలగడంలేదు. చంద్రబాబు తనమీద నమ్మకం పెట్టుకుంటే అకస్మాత్తుగా వైసీపీలోకి వెళ్లాను కాబట్టి చేర్చుకుంటారా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్నారు. అవంతి రాకను కూడా తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నారు. చివరకు ఈ మాజీ మంత్రి రాజకీయ పయనం ఎటువైపు పయనిస్తోందో చూడాలి.












Click it and Unblock the Notifications