ఇరుకునపడ్డ చిరంజీవి, అసంతృప్తితో చంద్రబాబువైపు..!
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారిన నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి రంగంలోకి దిగి తన వర్గం ప్రజాప్రతినిధులను బుజ్జగించడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం చిరు తన వర్గం శాసనసభ్యులు, మంత్రులతో భేటీ అయిన విషయం తెలిసిందే. అధిష్టానం ఆదేశాలతోనే చిరు రంగంలోకి దిగినట్లుగా భావిస్తున్నారు.
విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో పలువురు కాంగ్రెసు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాస రావు పేరు వినిపిస్తోంది. శుక్రవారం తన వర్గం నేతలతో భేటీ అయిన చిరు తొందర పడొద్దని,
23 తర్వాత మరోసారి భేటీ అవుదామని సూచించారు. అయితే, సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, మళ్లీ పోటీ చేస్తే గెలిచే పరిస్థితి కనిపించడం లేదని వారు చిరుతో వాపోయారు. చిరు మాత్రం ప్రస్తుతానికి తొందరపడొద్దని సూచించారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు తాను చేసిన ప్రయత్నాలను వారికి వివరించారట. పార్టీ నుండి సీనియర్ నేతలు వెళ్లిపోయినా ప్రజారాజ్యం పార్టీ నేతలం మాత్రం కాంగ్రెసులోనే ఉందామని వారికి ఉద్బోద చేశారట. ఇప్పుడు కాకుంటే తర్వాత ఎన్నికల్లో మనకు మంచి రోజులు వస్తాయని సూచించారట. అవిశ్వాస తీర్మానం సమయంలో చిరంజీవి మద్దతు కారణంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు గట్టెక్కింది. ఆ తర్వాత చిరు అధిష్టానానికి విశ్వాసం గల నేతగా మెలిగారు.
అయితే విభజన నిర్ణయంతో ఆయన ఇరుకున పడ్డారంటున్నారు. పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న వారిలో ఆయన వర్గానికి చెందిన నేతలు ఉండటంతో అధిష్టానం వద్ద సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడగా, అధిష్టానం తెలంగాణ అంటున్నా చిరు ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోలేదని ఇటు క్యాడర్‌లో అసంతృప్తి ఉందని అంటున్నారు. ఇలా చిరు రెండు వైపులా ఇరుకున పడిపోయారట.
చిరుపై ఆగ్రహం.. టిడిపి వైపుకు వారు..
మరోవైపు, కాపు వర్గాన్ని ఆకట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తోందని, అందులో అది సఫలమవుతోందని అంటున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు వర్గం ఎక్కువగా ఉంటుంది. ఇతర పలు జిల్లాలలోను ఆ వర్గాల మెజార్టీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాపు వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం, గంటా శ్రీనివాస రావు, తోట నర్సింహులు తదితరులు టిడిపి వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
2008లో చిరంజీవి పార్టీ పెట్టడంతో 2009 ఎన్నికల్లో కాపు వర్గం ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలిచాయి. నాటి ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నప్పటికీ భవిష్యత్తులో పిఆర్పీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ వర్గం భావించింది. కానీ, చిరంజీవి పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేశారు. దీనిని వారు జీర్ణించుకోలేకపోయారనే చెప్పవచ్చు.
విభజన నిర్ణయం నేపథ్యంలో చిరంజీవి స్థాపించిన పిఆర్పీ ఉండి ఉంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించేదని, 2014 ఎన్నికల తర్వాత కొత్త సీమాంధ్ర రాష్ట్రానికి చిరు ముఖ్యమంత్రి కూడా అయ్యేవారని, విలీనంతో ఆ అవకాశం లేకుండా పోయిందని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిరు పిఆర్పీని విలీనం చేయడంపై కాపు వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. దీంతో ఇప్పుడు ఆ వర్గం క్రమంగా టిడిపి వైపు మొగ్గు చూపుతున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications