ycp jagan mohan reddy vijaya sai reddy lotus pond tdp chandra babu వైసీపి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చంద్రబాబు టీడిపి
ఎచట బాబు వ్యతిరేక గళం వినిపించునో అచట విజయుడు వాలి పోవును..!! వైసీపిలో ఆయనకు కొత్త కొలువు..!!
అమరావతి/ హైదరాబాద్ : వైయస్ఆర్ సీపిలో విజయసాయి రెడ్డి కీలక రాజకీయాలు నెరపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అదికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ గళం విప్పినా వారిని మచ్చిక చేసుకుంటూ రాబోవు రోజుల్లో ఫలితం రాబట్టాలనుకుంటున్నారు విజయ సాయి రెడ్డి. అందులో భాగంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలను బాగా ఉపయోగించుకుంటున్నారు విజయ సాయి. తెలంగాణలో మోత్కుపల్లి ఎపిసోడ్ నుండి తాజాగా దగ్గుబాటి కుటుంబం జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపుల వరకు అన్నీ తానై వ్యవహరించారట విజయ సాయి. దీంతో ఎచట టీడిపి వ్యతిరేక గళం వినిపించునో అచట విజయసాయి వాలిపోవును అనే చర్చ జోరుగా జరుగుతోంది.

పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న విజయ సాయి..! అదికారమే లక్ష్యంగా అడుగులు..!!
విజయసాయిరెడ్డి..! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి తర్వాత అంతటి పేరొందిన నేత. దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆడిటర్‌గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించారు జగన్‌మోహన్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఢిల్లీలోని పీఎంవో చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా బాగా ప్రాచూర్యం పొందారు విజయసాయి రెడ్డి.

జగన్ కు కీలక సలహాలు..! తటస్థులను వైసీపిలోకి లాగుతున్న విజయ సాయి..!
వైసీపీలో కీలక నేతగా మారిపోయిన విజయ సాయి రెడ్డి ని జగన్మోహన్ రెడ్డి అందరికంటే ఎక్కువగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఏమైనా బాధ్యతలు అప్పగించాలన్నా, కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భంలో సలహాలు తీసుకోవాలన్నా జగన్.. ముందుగా విజయసాయినే పలకరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే వైసీపీ కార్యక్రమాల్లో ఆయన కచ్చితంగా కనిపిస్తున్నారు. అంతేకాదు, విజయసాయి మరికొన్ని కీలక అంశాల్లో చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది.

బలమైన నేతలకోసం వల..! బాబు వ్యతిరేకులు ఎవరికైనా పదవులు ఇవ్వడానికి సై..!!
రాయలసీమ ప్రాంతంలో తన మార్కును చూపించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో మెరుగవ్వాలని భావిస్తోంది. అందుకోసం ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీలోకి కీలక నేతలను తీసుకురావాలని ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఇందులో భాగంగానే ఆయన.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా ఆయన టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

జగన్ కోటరీలో కీలకంగా మారిన సాయి..! పార్టీ లో చేరికలకు మార్గం సుగమం చేస్తున్న ఆడిటర్..!
చిన్నా చితకా నేతలనుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరితో విజయసాయి చర్చలు జరుపుతూ వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలో చేరిన కొందరు నేతలతో పాటు, కదిరి అర్బన్ సీఐ గోరంట్ల మాధవ్, దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరడం వెనుక విజయసాయి చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చేరికలే కాదు.. రాజకీయాలు చేయడంలోనూ ఆయన ఆరితేరిపోయారు. గతంలో టీడీపీ బహీష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కూడా కలిశారు. అప్పట్లో మోత్కుపల్లి, వైసీపి అంశం పెద్ద సంచలనంగా మారింది. ఇలా ఎవ్వరు వైసీపికి అనుకూలంగా మాట్లాడకపోయినా., చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లడితే విజయసాయి రెడ్డి అక్కడ ప్రత్యక్షం అవుతారన్న మాట..!