బాలయ్య కనిపించటం లేదు - వైసీపీ నేతలతో సహా : హిందూపూరంలో కొత్త సమీకరణం ..!!
ప్రముఖ సినీ నటుడు - హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించటం లేదు. ఇది వైసీపీ నేతలు చెబుతున్న అంశం కాదు. స్వయంగా బాలయ్య ఇలాకాలోనే ఆయన కనిపించటం లేదంటూ పార్టీలకు అతీతంగా ఫిర్యాదు నమోదైంది. ఏపీ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు పైన కొన్ని ప్రాంతాల్లో హర్షం వ్యక్తం అవుతుండగా.. మరి కొన్ని ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.

హిందూపురంలో కొనసాగుతున్న నిరసనలు
అందులో భాగంగా.. కొత్త జిల్లా కేంద్రంగా ఖరారు చేస్తున్న ప్రాంతాల పైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజా ప్రతిపాదనల్లో పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తాజాగా అఖిలపక్ష నేతలు బంద్ సైతం నిర్వహించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పైన స్థానికులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. తమ ఎమ్మెల్యేతో పాటుగా వైసీపీ నేతలు సైతం కనిపించటం లేదంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాలయ్యతో సహా వైసీపీ నేతలపై
ఈ మేరకు వన్‌టౌన్ పోలీసు సేష్టన్ లో ఫిర్యాదు చేసారు. ఆందోళనలో పాల్గొంటున్న బీజేపీ నేతలు టీడీపీ - వైసీపీ నేతలు తమతో కలిసి రావాలని డిమాండ్ చేసారు. ఇప్పటికైనా వారంతా బయటికి వచ్చి, వెంటనే పదవులకు రాజీనామా చేసి, హిందూపురం జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంలో పాల్గొనాలంటూ నినాదాలు కొనసాగించారు. అయితే, ఇప్పటికే బాలయ్య కొత్త జిల్లాల అంశం పైన స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించారు. హిందూపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.

టీడీపీ కంచుకోటలో ఏం జరగనుంది
అయితే, ఇప్పుడు వైసీపీ నేతలు సైతం హిందూపూర్ ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆ పార్టీ పైన ఒత్తిడి పెంచుతున్నాయి. కొత్త జిల్లా ప్రకటన వేళ...టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపూర్ లో పార్టీలకు అతీతంగా సాగుతున్న కొత్త జిల్లా రాజకీయంలో అటు ఉద్యమ కారులకు మద్దతు ఇవ్వలేక.. ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనలేక వైసీపీ నేతలు ఇరకాటంలో పడ్డారదు. అదే సమయంలో హిందూపూర్ ను కాదంటే పుట్టపర్తిలో ఎటువంటి స్పందన వస్తుందనే ఆందోళన టీడీపీలో వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన బాలయ్య ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications