జైల్లో ఎందుకు మగ్గేవాడిని: జేవురించిన మొహంతో జగన్
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీతో తాను కుమ్మక్కయితే 16 నెలల పాటు ఎందుకు జైల్లో మగ్గుతానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అడిగారు. ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం జేవురించింది. కుమ్మక్కు కావడంవల్లనే బెయిల్ వచ్చినట్లు వస్తున్న ఆరోపణలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ఆలోచించాలని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గవర్నర్‌ను కలిసి కోరిన తర్వాత ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్య డీల్ ఉందని చంద్రబాబు, కో అంటున్నారని, నిజంగా డీల్ ఉంటే మూడు నెలల్లో బెయిల్ రావాల్సి ఉండగా, 16 నెలల సమయం ఎందుకు పడుతుందని ఆయన అడిగారు. దర్యాప్తు పూర్తి కాకపోతే మూడు నెలలోగా బెయిల్ ఇవ్వాలని రాజ్యాంగంలో నిబంధన ఉందని, అయినా తాను 16 నెలలు జైలులో ఉండాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

ఐఎంజి కేసుల్లో తనపై విచారణ జరగకుండా కోర్టుకు వెళ్లింది చంద్రబాబు కాదా అని ఆయన అడిగారు. అవిశ్వాస తీర్మానం పెడితే విప్ జారీ చేసి ఆ తీర్మానం నెగ్గకుండా చంద్రబాబు చేశారని, ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి అవిశ్వాస తీర్మానం వరకు చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని, తనపై విచారణ జరగకుండా చూసుకున్నారని ఆయన అన్నారు. ఆర్టీఐ కమీషనర్ల పదవులను కాంగ్రెసుతో కలిసి చంద్రబాబు పంచుకున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెసుకు చెందిన శంకరరావు, టిడిపికి చెందిన ఎర్రంనాయుడు కలిసి తనపై రిట్ పిటిషన్లు వేశారని, రిట్ పిటిషన్లలో కూడా ఏ మాత్రం తేడా లేదని ఆయన అన్నారు. రాజకీయ కుట్ర కారణంగానే తాను 16 నెలలు జైలులో ఉండాల్సి వచ్చిందని, రాజకీయ పార్టీలే కోర్టుకు వెళ్లాయని ఆయన అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాలన మంచిదేనని జగన్ అన్నారు. అయితే, తాము మతతత్వ పార్టీలతో జత కట్టబోనని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని లౌకిక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications