భారత్ లో కోవిడ్ కేసులపై WHO హెచ్చరికలు-వాళ్లు బూస్టర్ డోస్ వేయించుకోవాల్సిందే...
భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వైరస్ వ్యాప్తి ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో వేగంగా సాగుతోంది. గత 24 గంటల్లోనే 2994 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16354కు చేరుకుంది. ఈ సంఖ్య ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్ని కలవరపెడుతోంది. ఇదే తీరుగా కేసుల సంఖ్య పెరిగితే గతంలో కోవిడ్ రెండో వేవ్ తరహా పరిస్దితులు తప్పవనే భయాలు నెలకొంటున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా భారత్ లో కోవిడ్ కేసుల పరిస్ధితిపై దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో భారత్ కు పలు సూచనలు చేసింది. ఇందులో ప్రమాదకరమైన వయో వర్గాలుగా భావించే వృద్ధులకు బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేయించాలని సూచించింది. అది కూడా కోవిడ్ రెండో డోస్ వేయించుకున్న 6 నుంచి 12 నెలల తర్వాత మాత్రమే ఇది తీసుకోవాలని సూచిస్తోంది. ఈ బూస్టర్ డోస్ వేయించుకోవాల్సిన వర్గాల్లో వృద్ధులతో పాటు తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న మధ్య వయస్కులు కూడా ఉంటారని పేర్కొంది.

ప్రస్తుత పరిస్ధితుల్లో ఈ వర్గాలకు బూస్టర్ డోస్ వేయించకపోతే మాత్రం కోవిడ్ వైరస్ సోకి ప్రాణాంతకం కావడం ఖాయమని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరిస్తోంది. అయితే భారత్ లో ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకూ కోవిడ్ బూస్టర్ డోస్ గురించి కానీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ పునఃప్రారంభించే అంశంపై కానీ స్పందించడం లేదు. కేవలం రాష్ట్రాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ వాస్తవ పరిస్ధితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. కేసుల సంఖ్య ఇంకా పెరిగితే అప్పుడు చూద్దామనే ధోరణి ప్రభుత్వాల్లో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications