చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి రారా ? రానివ్వడం లేదా ? ఏ జరుగుతోంది ?
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు కలిసి పనిచేయడం చూస్త్తూనే ఉన్నాం. కలిసి పనిచేసే అవకాశం ఉన్నా లేకపోయినా కనీసం రాష్ట్రాల రాజధానుల్లోనే ఉంటూ అధికార పార్టీలకు, ప్రభుత్వాలకు తగు సూచనలు చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎంతటి బద్ధ శత్రువులైనా పరస్పరం సహకరించుకుంటూ అంతిమంగా ప్రజలను ఈ మహమ్మారి నుంచి ఎలా గట్టెక్కించాలో ఆలోచించాల్సిన సమయం ఇది. కానీ ఏపీలో ఓవైపు కరోనా వైరస్ నియంత్రణ చర్యలు ఉద్ధృతంగా సాగుతుంటే విపక్ష నేత చంద్రబాబు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనే ఉండిపోవడం తీవ్ర చర్చనీయాంశవుతోంది.

హైదరాబాద్ లోనే చంద్రబాబు...
2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఏపీకి రాకుండా హైదరాబాద్ నుంచే పాలన సాగించిన అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఓటుకు నోటు కేసు బయటికి వచ్చే వరకూ అక్కడే ఉండిపోయారు. కానీ కేసీఆర్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ చేస్తోందన్న కారణంతో హుటాహుటిన అమరావతి వచ్చేసిన చంద్రబాబు అఫ్పటి నుంచి దాదాపుగా సొంత రాష్ట్ర రాజధానిని వదిలి వెళ్లలేదు. వారాంతాల్లో హైదరాబాద్ వెళ్లినా తిరిగి సోమవారం ఠంచనుగా అమరావతి వచ్చేసే వారు. కానీ గతేడాది అధికారం కోల్పోయాక అమరావతి కంటే ఎక్కువగా హైదరాబాద్ కే ఆయన పరిమితం అవుతున్నారు. తాజాగా కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రకటించే నాటికి హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు ఆ తర్వాత కూడా అక్కడే ఉండిపోయారు.

జూమ్ యాప్ ద్వారానే అన్నీ...
ఒకప్పుడు తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరంపైన మోజో లేక తాను ప్రోత్సహించిన ఐటీతోనే అంతా సవ్యంగా సాగిపోతుంటే ఇక అమరావతి రావడం ఎందుకని చంద్రబాబు భావిస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి. ప్రస్తుతం చంద్రబాబు జూబ్లీహిల్స్ లో కట్టుకున్న సొంత ఇంట్లోనే కుటుంబ సభ్యులతోనే కాలక్షేపం చేస్తున్నారు. మధ్యలో టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లు, టెలీ కాన్ఫరెన్స్ లు, జూమ్ యాప్ ద్వారా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లో విఫలమైందంటూ ఇంట్లో ఉండే ఆయన విమర్శలు సాగిస్తున్నారు.

అమరావతికి రాలేరా.. రానివ్వడం లేదా ?
లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వీఐపీలను మాత్రం ప్రత్యేకంగా ఏపీలోకి అనుమతిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ కనగరాజ్, మాన్సాస్ ఛైర్మన్ సంచైత గజపతిరాజు సెక్రటరీలను ఇలాగే చెన్నై నుంచి వచ్చేలా అనుమతి ఇచ్చారు. అలాగే సీపీఐ రామకృష్ణను సైతం ప్రభుత్వం హైదరాబాద్ వెళ్లి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. అటువంటప్పుడు చంద్రబాబు మాత్రం ఎందుకు అనుమతి కోరలేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని అనుమతి కోరకుండా కావాలనే హైదరాబాద్ లోనే ఉండిపోతున్నారని వైసీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. హైదరాబాద్ నుంచి వలస కూలీలంతా వచ్చేస్తున్నా ఇద్దరు మాత్రం అక్కడే ఉండిపోయారని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ను ఉద్దేశించి సెటైర్లు కూడా వేస్తున్నారు. అయినా స్పందన శూన్యం.

హైదరాబాద్ నుంచే సలహాలు...
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓవైపు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇలాంటి సమయంలో స్వరాష్ట్రంలో ఉంటే అఖిలపక్ష సమావేశం పెట్టమని ప్రభుత్వాన్ని ఆయన కోరే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆయనకు బదులుగా బీజేపీ, సీపీఐ వంటి ఇతర పక్షాల నేతలు ఇదే డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచాయి. కానీ చంద్రబాబు మాత్రం జూమ్ యాప్ ద్వారా అఖిలపక్ష సమావేశం పెట్టాలని కోరుతున్నారు. మరోవైపు తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే ప్రస్తుతం అమరావతికి వచ్చినా బయట తిరిగే అవకాశం కానీ, నేతలతో సమావేశమయ్యే అవకాశం కానీ లేనందున తాను భాగ్యనగరానికి పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది.